calender_icon.png 6 January, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడి బారెడు.. పెంపు మూరెడు..!

04-07-2024 02:18:43 AM

  • వ్యవసాయ పంటలకు మద్ధతు ధర పెంచిన కేంద్రం 
  • వరికి క్వింటాకు రూ. 117 మాత్రమే పెంపు 
  • గతేడాదితో పోలిస్తే రూ.26 తక్కువ 
  • పెరిగిన పంట సాగు ఖర్చులు.. డీజిల్, పెట్రోల్ భారం 
  • గిట్టుబాటు కాదంటున్న రైతులు 

సంగారెడ్డి, జూలై ౩ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన పంటకు మద్దతు ధర రైతులకు నిరాశే మిగిల్చింది. వరికి క్వింటాలుకు రూ.117 మాత్రమే పెంచి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వరికి గతేడాది రూ.143 పెంచగా, ఈ ఏడాది రూ. 26 తగ్గించి మద్దతు ధర ప్రకటించింది. వ్యవసాయ పంట ఖర్చులు పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కేంద్రం పెంచిన మద్దతు ధరలు చిరుధాన్యాల పంటలకు వర్తించదని రైతులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో చిరుధాన్యాల పంటలకు మంచి ధర ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడం లేదని రైతులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆంధోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో వరి పంట, జహీరాబాద్, ఆంధోల్, నారాయణఖేడ్‌లో ప్రత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. దీంతో, జిల్లా రైతులకు మద్దతు ధర నిరాశే మిగిల్చింది. 

పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు

వానాకాలంలో రైతులు అధికంగా  వరి, పత్తి, సోయా, జొన్న, పెసర, మినుము, కందితో పాటు పలు రకాల పంటలు సాగు చేస్తారు. అయితే కేంద్రం వరి (సాధారణం)కు రూ.117 మద్దతు ధర పెంచి క్వింటాలుకు రూ. 2300 వద్ద కొనుగోలు చేస్తుంది. వరి (గేడ్ రూ.117కు పెంచి క్వింటాలుకు రూ.2320 చేసింది. పత్తి (మధ్యరకం) రూ.501 పెంచి రూ. 7,121 గా ప్రకటించింది. పత్తి (లాంగ్ స్టెపెల్) రూ.501 పెంచి, రూ.7,521 చేసింది.

సోయబీన్‌కు రూ.292 పెంచి, రూ.4,892 చేసింది. కందికి రూ. 550 పెంచి, రూ.7,550 ప్రకటించింది. మొక్కజొన్నకు రూ.135 పెంచి, రూ. 2225 ప్రకటించింది. మినుములు రూ.450 పెంచి, రూ.7400 చేసింది. పెసలు రూ.124 పెంచి, రూ.8,682 చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కాదని, పెరిగిన పంట పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచలేదని వాపోతున్నారు. 

పెరిగిన పంట పెట్టుబడి ఖర్చులు 

రైతులు పండిస్తున్న పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఉండడం లేదు. గతేడా ది ఎకరం భూమి దున్నేందుకు రూ. 6300 వరకు ఖర్చు చేసే వారు. ఈ ఏడాది డీజీల్, పెట్రోల్ ఖర్చులు పెరిగిపోవడంతో ఎకరం భూమి దున్నేందుకు రూ. 7500 వరకు ఖ ర్చు అవుతోంది. ఎరువులు, విత్తనాల ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల పంట వ్యయం కూడా పెరిగింది. మరోవైపు. వ్యవసాయ యంత్రల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో పెద్ద సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు బావులు, బోరుల వద్ద వరి పంటను సాగు చేస్తున్నారు. ఇది వారికి మరింత భారంగా మారింది. 

పత్తికి మద్దతు ధర కరువు

తేమ పేరుతో వ్యాపారులు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. పత్తిలో తేమ ఉందనే సాకు తో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు వ్యాపా రు లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సోయాబీన్‌కు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ మద్దతు ధర అమలు చేయడం లేదు. పెసర, మిను ము పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. కంది పంటకు మద్దతు ధర ఉన్నప్పటికీ వ్యాపారులు నాణ్యత పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

మరోవైపు, బహిరంగ మార్కెట్‌లో పప్పులకు మంచి ధర పలుకుతున్నా గిట్టుబాటు ధర కల్పించలేదని రైతులు చెబుతున్నారు. కూలీల ఖర్చులు పెరిగిపోవడం, పురుగుల మందు లు, ఎరువుల ధరలు భారీగా పెరిగిపోవడం తో రైతులకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ గా వస్తున్నాయి. బ్యాంకులు పంటలు సాగు చేసేందుకు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డి వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోని నష్టపోతున్నారు.