calender_icon.png 7 November, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అని మోసం

07-11-2024 12:07:25 AM

16.25 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మించి ఓ వ్యక్తి ఖాతా ఖాళీ చేశాడు సైబర్ నేరగాడు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి యాక్సిస్ డైరెక్ట్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో చీఫ్ స్ట్రాటజిక్ అనలిస్ట్ పేరుతో ఇటీవల వాట్సాప్ మెసేజ్ వచ్చింది.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే 3 నుంచి 5 శాతం లాభాలు వచ్చేలా చేస్తానని తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రారంభంలో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన చిట్కాలను అందించేవాడు. తర్వాత యాక్సిస్ డైరెక్ట్ తరఫున ‘వరల్డ్ టాప్ ఇన్వెస్టర్ కాంపిటీషన్’లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నాడు.

సైబర్ నేరగాడి మాటలను నమ్మిన బాధితుడు.. అతడు సూచించిన విధంగా ‘యాక్సిస్ ఐ గ్లోబల్ ప్రో’ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలో చేరాడు. అలాగే అంతర్జాతీయ ఖాతాను తెరవడానికి తన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను అందించాడు. సైబర్ నేరగాడు చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టి మొదట్లో భారీ లాభాలు అందుకున్నాడు.

మరింత డబ్బు వస్తుందని ఆశపడి ఆ తర్వాత పలు దఫాలుగా మొత్తం రూ. 16.25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.