calender_icon.png 7 November, 2024 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్‌పై విచారణ

03-08-2024 05:26:30 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో మంత్రి మంత్రి సీతక్క మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించారు. అసెంబ్లీలో వీడియో తీయడం అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు విరుద్ధమన్నారు. మంత్రి సీతక్క గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో స్పీకర్‌ను కోరారు. దీంతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. అనంతరం తెలం గాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు సభలో చర్చ కొనసాగింది.

బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ మాట్లాడుతూ.. డిజిటల్ వేదికలపై పౌరులు తమ భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించేలా చట్టాలు ఉంటే బాగుంటుంద న్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ప్రసంగించారు. ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించనంత వరకు ఎలాంటి సమస్య ఉండదని కానీ,  ఆ రెండింటికీ భంగం కలిగితే చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని సమాధానమిచ్చారు. అలాగే ఉచిత బస్సు ప్రయా ణంపై సైతం దారుణమైన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయన్నారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శాసనసభ గౌరవాన్ని దిగజార్చే విధంగా ఎవరు యత్నించినా సహించబోమని హెచ్చరించారు. తర్వాత మార్ఫింగ్ అంశంపై బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రసంగిస్తూ.. పార్లమెంట్‌లో సైతం కొందరు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని, అక్కడ ఎలాంటి చర్యలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయం గతంలో ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డికి తెలుసునన్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బదులిచ్చారు. పార్లమెంట్‌లో వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. గతంలో రజినీ పాటిల్ అనే కాంగ్రెస్ ఎంపీ వీడియో తీశారని, ఫలితంగా సభాపతి ఆయన్ను ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని గుర్తుచేశారు.