calender_icon.png 17 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంప్ హౌస్ ఇంజినీర్ల విచారణ!

07-07-2024 12:52:40 AM

‘కాళేశ్వరం’పై వేగం పెంచిన కమిషన్

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారిస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ వేగం పెంచింది. ప్రాజెక్టులోని పంప్ హౌస్‌లకు చెందిన ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ విచారించనున్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ల ఇంజినీర్లను విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని సంబంధిత అధికారులకు కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి.

సోమ వారం నుంచి మూడు పంప్ హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈ వరకు ఇంజినీర్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి కూడా అవసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతోపాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌తో ఆయన మాట్లాడినట్లు సమాచారం.

నిపుణుల కమిటీ సభ్యులతో భేటీ 

పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)కు కమిషన్ ఓ నిపుణుల ప్రతినిధి బృందాన్ని పంపి అధ్యయనం చేయించింది. కమిషన్‌కు సహాయకారిగా  ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ పీసీఘోష్ సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్య యనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

ఇరిగేషన్ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటివరకు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతోంది. అనంతరం అవసరమైన వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్‌కు ఎవరు ఏం చెప్పినా రికార్డు రూపంలో ఉండాలని ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టంచేశారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో పనులు జరిగాయన్న వివరాలు రికార్డు రూపంలో వచ్చిన నేపథ్యంలో విచారణను వేగవంతం చేయనున్నారు.