calender_icon.png 28 December, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెత్ మిస్టరీపై దర్యాప్తు షురూ

28-12-2024 02:50:25 AM

  1. విచారణకు ప్రత్యేక పోలీస్ అధికారుల బృందం ఏర్పాటు
  2. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేలోపు మిస్టరీపై నిగ్గుతేల్చనున్న ప్రత్యేక బృందం
  3. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాట్ సేకరణలో నిమగ్నం
  4. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఇతర సాంకేతికతలపై దృష్టి సారింపు

కామారెడ్డి, డిసెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన భిక్కనూర్ ఎస్‌ఐ సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శృతి, బీబీపేట విండో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ నిఖిల్‌కుమార్‌ల మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ సింధూశర్మ ఏర్పాటు చేశారు. ముగ్గురి డేత్ మిస్టరీపై ప్రత్యేక పోలీస్ బృందం దర్యాప్తు షురూ చేసింది.

గురువారం ముగ్గురి డెడ్ బాడీలను కామారెడ్డి జిల్లా సదాశివ్‌నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో నుంచి బయటకు తీసిన విషయం విధితమే. వారి వారి గ్రామాల్లో గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో పోలీస్ అధికారులు పాల్గొని ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు.

కాగా వారి మృతిపై మిస్టరీ మాత్రం వీడలేదు. ఎస్‌ఐ సాయికుమార్ సొంతకారులోనే ముగ్గురు అడ్లూర్ ఎల్లారెడ్డికి వెళ్లినట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ సింధూశర్మ ఏర్పాటు చేసి ముగ్గురు మృతిపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక పోలీస్ బృందం చాకచాక్యంగా మృతుల సెల్‌ఫోన్ల డాటాను నెల రోజుల నుంచి వాడిన వివరాలను సేకరిస్తున్నారు. 

కొనసాగుతున్న విచారణ..

భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, నిఖిల్‌కుమార్ గత 15 రోజుల్లో వారు ఉన్న ప్రదేశాల్లోని సీసీ కెమెరాలను పోలీస్ ప్రత్యేక బృందం సేకరిస్తోంది. భిక్కనూర్‌లో ఎస్‌ఐ సాయికుమార్  కొన్నిరోజులుగా ఎక్కడెక్కడ తిరిగారు అనే వివరాలు సేకరిస్తున్నారు. పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారుల నుంచి నుంచి కూడా వివరాలు తీసుకుంటున్నారు.

కానిస్టేబుల్ శృతి ఎవరెవరితో ఎక్కువగా ఉండేది? ఏం మాట్లాడేది? అనే వివరాలను ప్రత్యేక పోలీస్ బృందం సేకరిస్తోంది. బీబీపేట విండో కార్యాలయంలో నిఖిల్‌కుమార్ తీరుపై కూడా తనిఖీ చేస్తున్నారు. విచారణలో భాగంగా ప్రత్యేక బృందం సీసీ ఫుటేజీల వివరాలను సేకరించింది. మరో రెండురోజులు దర్యాప్తు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.

మొదటిరోజు దర్యాప్తులో అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతాల పరిధిలో ఉన్న సీసీ కెమారాల ఫుటేజీలను సేకరించినట్లు తెలుస్తోంది. భిక్కనూర్ నుంచి 44వ జాతీయ రహదారి గుండా ఎస్‌ఐ సాయికుమార్ కారు ఎక్కడెక్కడ ఆగింది? ఎక్కడెక్కడి నుంచి వెళ్లింది భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఎన్ని గంటలకు బయల్దేరింది, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎప్పుడు ప్రవేశించింది, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద, టెక్రియాల్ చౌరస్తా నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు వైపు ఎన్ని గంటలకు కారు వెళ్లింది అనేక కోణాల్లో పోలీస్ బృందం సీసీ పుటేజీలను సేకరించి వివరాలను ఆరా తీస్తున్నారు. 

శృతిని రక్షించబోయి..!

శృతి ఎస్‌ఐ సాయికుమార్‌తో పాటు నిఖిల్‌తో విభేదించి చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకే నిఖిల్, ఎస్‌ఐ సాయికుమార్ చెరువులో దూకినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ సాయికుమార్‌కు ఈత వచ్చినా నాచు, తీగలు చుట్టుకోవడంతోనే ఊపిరాడక మృతిచెందినట్లు తెలుస్తోంది.

సాయికుమార్ మాదిరే నిఖిల్ కూడా నాచులో చిక్కుకోవడంతో మృతిచెందినట్లు భావిస్తున్నారు. కాగా ఎస్‌ఐ సాయికుమార్ తన జేబులోనే సెల్ ఫోన్ ఉంచుకొని చెరువులో దూకినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి. 

అతిసాన్నిహిత్యమే కొంప ముంచిందా..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురి డెత్ మిస్టరీ కేసులో అతి సాన్నిహిత్యమే వారి ముగ్గురి కొంప ముంచినట్లు తెలుస్తోంది ఎస్‌ఐ సాయికుమార్ బీబీపేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడింది. నిఖిల్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో కంప్యూటర్లు రిపేర్‌కు వచ్చినప్పుడు వాటిని బాగుచేసేవాడు.

పైగా పీజీవరకు చదవడం, ఒకే కులానికి చెందిన వారు కావడంతో నిఖిల్‌కుమార్, ఎస్‌ఐ సాయికుమార్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఎస్‌ఐ సాయికుమార్ బీబీపేట్ పీఎస్ నుంచి భిక్కనూర్‌కు బదిలీ కావడంతో నిఖిల్ కుమార్‌తో మహిళా కానిస్టేబుల్ శృతి మధ్య మరింత సన్నిహితం పెరిగింది. దీంతో ముగ్గురు ఫోన్ కాల్స్, చాటింగ్ చేసుకునేవారు.

నిఖిల్‌కుమార్‌తో ఒకటయ్యేందుకు శృతి, నిఖిల్ ఇంటికి సమీపంలో రూమ్ అద్దెకు తీసుకుంది. కొద్ది రోజులుగా శృతిలో మార్పు వచ్చినట్లు స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. శృతికి గర్భం రావడం వల్లే ఎస్‌ఐ సాయికుమార్, నిఖిల్‌కుమార్‌లపై ఒత్తిడి పెంచిందని మరికొందరు వాపోతున్నారు. తమ గుట్టు బయట పడుతుందని భావించిన వారు సమస్యను పరిష్కరించుకునేందుకు అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది