calender_icon.png 12 March, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రన్యారావు సవతి తండ్రిపై ఆరా

11-03-2025 11:38:52 PM

ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..

కేసు విచారణ అధికారిగా గౌరవ్ గుప్తా నియామకం..

కన్నడ నటి నివాసం, పెళ్లి వివరాలపై సీబీఐ కన్ను..

బెంగళూరు: కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. బంగారం తరలించే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ ప్రొటోకాల్‌ను ఉల్లఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రన్యారావు సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పాత్రపై ఆరా తీయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రన్యారావు రామచంద్రరావు పేరును ఉపయోగించినట్లు సమాచారం అందడంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ కేసు విచారణ అధికారిగా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

మరోవైపు ఈ కేసులో సీబీఐ తమ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే రన్యారావు వివాహానికి సంబంధించిన వీడియోలను పరిశీలించినట్లు సమాచారం. రన్యారావు నివాసం, ఆమెకు సంబంధించిన ప్రాంతాలు, వివాహం జరిగిన హోటల్ వివరాలపై దర్యాప్తు చేపట్టారు. పెళ్లికి హాజరైన అతిథులు అందించిన కానుకలపై కూడా దృష్టి సారించారు. ఇక రన్యారావు బెయిల్‌పై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. బెయిల్ అభ్యంతరాలు సమర్పించాలని డీఆర్‌ఐ అధికారులను కోర్టు ఆదేశించింది.