calender_icon.png 29 November, 2024 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ చెక్కులపై విచారణ

27-10-2024 12:38:52 AM

  1. టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ 
  2. ఈఆర్‌ఓ కార్యాలయాల్లో విజిలెన్స్ తనిఖీలు
  3. బిల్లులలో చెక్కు బౌన్స్, ఫేక్ చెక్కులపై ఆరా 
  4. ‘విద్యుత్ బిల్లులకు ఫేక్ చెక్కులు’ కథనానికి స్పందన
  5. రంగంలోకి దిగిన సీఎండీ, విజిలెన్స్ అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): టీజీఎస్‌పీడీసీఎల్ హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో ఫేక్ చెక్కుల వ్యవహారంపై తక్షణమే సమగ్రమైన విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.

విద్యుత్ శాఖలో బిల్లుల చెల్లింపులో చోటుచేసుకుంటున్న వాస్తవ పరిస్థితు లపై ‘విజయక్రాంతి’ దినపత్రిక శనివారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం మొత్తం డిస్కంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందిం చిన సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తక్షణమే విచారణ జరిపి నివేదిక అందజేయాలని సెంట్రల్ సర్కిల్ ఎస్‌ఈ వెంకన్న ను ఆదేశించారు.

ఎస్‌పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం అధికారులు సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఆజామాబాద్, ఇందిరాపార్కు, మింట్ కాంపౌండ్, ఏసీ గార్డ్స్, రేతిబౌలి ఈఆర్వో కార్యాలయాలలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు రికార్డులను పరిశీలించారు. 

ఈబీఎస్‌లో ఎంట్రీ చేశారా? 

ఈ సందర్భంగా 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఎన్ని బిల్లులకు చెక్స్ బౌన్స్ అయ్యాయి, వాటి పేమెంట్ క్లియర్ అయ్యిం దా.. ఇంకా బ్యాలెన్స్ ఉందా? బ్యాలెన్స్ ఉంటే ఈబీఎస్ (ఎనర్జీ బిల్లింగ్ సిస్టమ్)లో ఎంట్రీ చేశారా? చేయలేకపోతే ఎందుకు ఎంట్రీ చేయలేదు అనే విషయాలపై విజిలెన్స్ ఆరా తీసింది.

హైదరాబాద్ మెట్రో జోన్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఆజామాబాద్, మెహిదీపట్నం, సైఫాబాద్ డివిజన్లలో విద్యుత్ బిల్లుల చెల్లింపులో గోల్‌మాల్ వ్యవహారంపై ‘విజయక్రాంతిదినపత్రికవిద్యుత్ బిల్లులకు ఫేక్ చెక్కులు..!’ అనే శీర్షికన శనివారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనంలో సెంట్రల్ సర్కిల్ పరిధిలో 2023 జనవరి నుంచి రూ.4.49 కోట్ల విలువైన 7,532 చెక్కులు బౌన్స్ అయినట్టుగా స్పష్టంగా, వివరణాత్మకంగా కథనం ప్రచురితమైంది. ఇలా బౌన్స్ అవుతున్న చెక్కులపై విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కనీసం చెక్ బౌన్స్ నిబంధనల ప్రకారం కూడా చర్యలు లేకపోవడాన్ని ప్రస్తావించింది.

ఒకవేళ విద్యుత్ బిల్లులకు చెల్లించిన చెక్కులు బౌన్స్ అయితే, బౌన్స్ చెక్కులకు ఎందుకు లేట్ పేమెంట్ ఛార్జీ (ఎల్‌పీసీ)లను విధించడం లేదనే విషయాన్ని ఆ కథనంలో ఎత్తి చూపడం జరిగింది. విద్యుత్ శాఖలో అనేక ఏళ్లుగా బిల్లులకు చెల్లించిన చెక్కులు బౌన్స్ అవుతున్నా వాటిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విషయాలను ఆ కథనంలో ప్రస్తావించింది.

ఏళ్ల తరబడి బౌన్స్ చెక్కులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో విద్యుత్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బంది ఈ చెక్కులు అన్నింటినీ ఫేక్ చెక్కులుగానే భావిస్తున్నారంటూ వివరణాత్మకంగా పేర్కొంది. ఇదిలా ఉండగా, సెంట్రల్ సర్కిల్ పరిధిలోని డివిజన్, ఈఆర్వో కార్యాలయాలను ఎస్‌ఈ వెంకన్న శనివారం పరిశీలిం చారు.

అయితే, సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఈఆర్వో కార్యాలయాలలో విజిలెన్స్ తనిఖీలపై ఎస్‌ఏఓ బ్రహ్మయ్యను వివరణ కోరగా ఎలాంటి తనిఖీలు జరగలేదని చెప్పడం కొసమెరుపు.