23-03-2025 12:52:51 AM
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు!
వాస్తవాలు తేల్చేందుకు ముగ్గురు జడ్జిల కమిటీ నియమించిన సీజేఐ
గతంలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వర్మ పేరు
న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనే వార్త సంచలనంగా మారిం ది. దీనిపై సీరియస్ అయిన సుపీం కోర్టు ఇప్పటికే ఆయనను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. తాజాగా ఈ ఘటన మీద ఢిల్లీ హైకోర్టుకు చెందిన ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీ వ్ ఖన్నా ఏర్పాటు చేశారు.
అంతే కాకుం డా ఈ విషయం తేలే వరకు యశ్వంత్ వర్మకు ఎటువంటి విధులు అప్పగించొద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ముగ్గురు జడ్జిల కమిటీకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శీల్ నాగు నేతృత్వం వహించనున్నారు. హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి సాంధవాలియాతో పాటు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అను శివరామన్ కూడా కమిటీలో ఉన్నారు.
అప్పట్లోనే వర్మపై సీబీ‘ఐ’
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ గత చరిత్ర గురించి అంతా ఆరా తీస్తున్నారు. కాగా యశ్వంత్ వర్మపై ఆరోపణలు, కేసులు కొత్తేం కాదని తెలుస్తోంది. 2018లోనే ‘షుగర్ మిల్క్ బ్యాంక్ ఫ్రాడ్’ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చింది. 2018లో సింబోలి షుగర్ మిల్స్ కేసులో ఆ సంస్థ డైరెక్టుర్లు ఇతరుల మీద సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కాగా ఈ ఎఫ్‌ఐఆర్‌లో యశ్వంత్ వర్మ పేరు కూడా ఉంది. ఆ కంపెనీకి యశ్వంత్ వర్మ నాన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
తమ వద్ద లోన్ తీసుకున్న షుగర్ మిల్ ఎగ్గొట్టేందుకు చూస్తోందని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఆనాటి కేసులో యశ్వంత్ వర్మ పేరును నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేర్చారు. ఇక ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో వ్యక్తి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బావమరిది కావడం గమ నార్హం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది.
హైకోర్టు ఉత్తర్వులు..
2023 డిసెంబర్‌లో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆనాటి కేసులో చాలా బ్యాంకుల హస్తం ఉందని ఫ్రెష్‌గా దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అంతే కాకుండా హైకోర్టు బ్యాంకుల మీద ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. ‘బ్యాంకు అధికారులు ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించడం లేదు. ఈ లోన్ విషయంలో ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు మేము సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం.
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2024లో సీబీఐ తాజాగా దర్యాప్తును ప్రారంభించింది. ఫ్రాడ్ జరిగినా కానీ బ్యాంకులు ఆ సంస్థకు ఎందుకు లోన్లు ఇస్తున్నాయనో తెలుసుకునే లక్ష్యంతో దర్యాప్తు జరిగింది. ఈ దర్యాప్తులో కంపెనీ డైరెక్టర్లతో పాటు కొంత మంది బ్యాంకు అధికారుల పేర్లు కూడా బయటపడ్డాయి. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.