calender_icon.png 5 November, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్జిషీట్ తర్వాతా దర్యాప్తు చేయొచ్చు

03-11-2024 12:10:05 AM

  1. తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం 
  2. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుకు చుక్కెదురు

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతా దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు తీర్పు వెలువరించింది.

చార్జిషీటును కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నాక పోలీసులు కోర్టు అనుమతితో దర్యాప్తు ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పోలీసులు కోరిన తర్వాత అనుమతి ఇచ్చే అధికారం కోర్టుకు ఉంటుందని తెలియజేసింది. అనుమతి ఇచ్చేప్పుడు నిందితుల వాదన వినాలన్న నిబంధన ఏమీలేదని తేల్చిచెప్పింది.

జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహమ్మద్ అమీర్ రహీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ కే సుజన ఇటీవల తీర్పు వెలువరించారు. తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ..

కింది కోర్టులో విచారణ ప్రక్రియ మొదలయ్యాక, సాక్షుల వాంగ్మూలం నమోదు దశలో దర్యాప్తునకు అనుమతించడం చట్టవిరుద్ధమని అన్నారు. విచారణ ప్రక్రియ మొదలయ్యాక తదుపరి దర్యాప్తునకు చేపట్టడానికి పోలీసులకు, మేజిస్ట్రేట్‌కు అధికారం లేదని చెప్పారు. నిందితుడు సయ్యద్ అఫ్నాన్ అహ్మద్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు పిటిషనర్‌కు నోటీసు ఇవ్వలేదని అన్నారు.

పిటిషనర్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. రాజకీయ కారణాలతోనే కేసును తిరగదోడుతున్నారని ఆరోపించారు. పోలీసుల తరఫున న్యాయవాది వాదిస్తూ.. కింది కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధమని, చార్జిషీట్ దాఖలు తర్వాత కోర్టు అనుమతితో కేసు దర్యాప్తును కొనసాగించే అధికారం పోలీసులకు ఉంటుందని అన్నారు.

రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తు సరైన కోణంలో జరగలేదని, అందుకే పోలీసుల దర్యాప్తు అవసరమైందని చెప్పారు. దర్యాప్తు లోప భూయిష్టంగా ఉందంటూ డీసీపీ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తునకు ఉన్నతాధి కారులు ఆదేశించారని వివరించారు.

ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు.. కేసులో ఇంకా విచారణ ప్రక్రియ మొదలుకాలేదని, పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగించితే ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పింది. పిటిషన్‌ను కొట్టివేసింది.