31-03-2025 05:58:00 PM
విద్యార్థినీలను కొట్టింది బయోసైన్స్ టీచర్ గా నిర్ధారణ..
బెల్లంపల్లి (విజయక్రాంతి): గత నెల 28న భీమిని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినీలను చితకబాదిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని స్థానిక మండల విద్యాధికారిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో సోమవారం భీమిని ఎంఈఓ క్రిష్ణమూర్తి, సెక్టోరియల్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తిలు ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలతో విచారణ జరిపారు.
గత నెల 28న ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ (ఎస్.వో), తెలుగు ఉపాధ్యాయురాలు శారద సెలవులో ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇన్చార్జి ఎస్.వో శారద విద్యార్థినిలను కొట్టినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. 6, 8వ తరగతి విద్యార్థినిలు తేజస్విని, భవాని, సుప్రజ లు తన వద్ద కాస్మోటిక్ వస్తువులు కొనడం లేదని బయో సైన్స్ ఉపాధ్యాయురాలు వారిని కొట్టినట్లు విచారణలో తెలిసిందన్నారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు వారు తెలిపారు.