calender_icon.png 29 March, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా నిర్బంధించి కొట్టారన్న ఆరోపణపై ఆళ్ళపల్లి ఎస్సైపై విచారణ

26-03-2025 11:37:30 AM

ఒక వ్యక్తిని కొట్టి.. ఉపవాస దినాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మోపి.. 

టేకులపల్లి, (విజయక్రాంతి): కారులో వస్తున్న వ్యక్తిని వాహన తనికీ పేరుతో ఆ వ్యక్తిని కొట్టి నిర్బందించడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఆళ్ళపల్లి ఎస్సై రితీష్ పై ఫిర్యాదుతో జిల్లా ఎస్ పి ఆదేశంపై  ఇల్లందు డిఎస్ పి చంద్రభాను విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. టేకులపల్లి మండలం కిష్టారం పంచాయతీ రోడ్డుగుంపు గ్రామానికి చెందిన మహమ్మద్ ఖలీద్ పాషా అనే వ్యక్తి తన భార్య ముహిమీద బేగం, తన స్నేహితుడు కంగల వెంకన్నతో కలిసి కారులో ఈ నెల 23న ఆళ్ళపల్లి మండలం(Allapalli Mandal) మార్కోడు గ్రామంలో రంజాన్ సందర్బంగా ఒక్కపొద్దు (ఉపవాసదీక్ష) విడిచేందుకు ఇఫ్తార్ విందుకు వెళ్లి వస్తున్నారు.

ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వాహన తనికీ చేస్తుండగా తన వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న స్పీడ్ బ్రేకర్ దాటించి కారుని ఆపి దిగే ప్రయత్నంలోనే ఎస్సై రితీష్ వచ్చి నానా బూతులు తిడుతూ చేయి చేసుకున్నారని ఖలీద్ భార్య తెలిపింది. అంతటితో ఆగకుండా ఖలీద్ ను నిర్బంధించి నలుగురు పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని, వారు కొట్టడంతో చెవి పని చేయడం లేదని ఆమె తెలిపింది.

అంతటితో ఆగకుండా తన భర్తను ఎందుకు కొడుతున్నారని అడిగితె బూతులు తిడుతూ తనపై కూడా మహిళా అని చూడకుండా చేయి చేసుకున్నారని వివరించింది. తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు ఎస్సై  మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు సంతకం చేయించుకొని అర్ధరాత్రి వదిలారన్నారు. దీనిపై జిల్లా ఎస్ పీ కి ఫిర్యాదు చేయడంతో ఎస్ పి ఇల్లందు డిఎస్ పి ని విచారణకు ఆదేశించారు. టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్, బోడు ఎస్సై శ్రీకాంత్ లు రోడ్డుగుంపు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారని తెలిసింది. ఆళ్ళపల్లి ఎస్సై పై గతంలో కూడా ఆర్ టీ సి డ్రైవర్ ను కూడా ఇదే రీతిలో కొట్టారన్న ఆరోపణ ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అంటూ ఈ విషయం తెలిసిన వారు ప్రశ్నిస్తున్నారు.