calender_icon.png 2 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కింగ్ వివాదంపై విచారణ జరిపించండి

02-02-2025 01:23:12 AM

* దుండిగల్ మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలో వివాదాస్పద భూముల్లో పార్కింగ్ విషయంలో ఇరువర్గాలను విచారించాలని దుండిగల్ మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపార్టీలకు చెందిన హక్కుల వ్యవహారంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని సూచించింది.

అలాగే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్‌ను ఆదేశించింది. బౌరంపేటలోని జీపీఆర్ లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో డాక్టర్ చింతల యాదగిరి అనే వ్యక్తి అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయిస్తున్నాడని, అందుకు ఫీజు సైతం వసూలు చేస్తున్నాడని జీపీఆర్ లేఅవుట్ ప్లాట్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. 

యాదగిరి అక్కడ కొన్ని కట్టడాలు సైతం నిర్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నది. పిటిషన్‌పై శనివారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘జీపీఆర్ హౌసిం గ్ ప్రైవేట్ లిమిటెడ్ 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ వేసింది.

ఆ ప్రాంతంలో డాక్టర్ చింతల యాదగిరి అనే వ్యక్తి అక్రమంగా పార్కింగ్ పెట్టాడని, తద్వారా ఆదాయమూ పొందుతున్నాడు. దీనిపై అసోసియేషన్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

డాక్టర్ చింతల యాదగిరి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘డాక్టర్ యాదగిరి కౌలుదారుల నుంచి 19 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమికి సంబంధించిన పాస్‌పుస్తకాలు సైతం రెవెన్యూశాఖ జారీ చేసింది. మున్సిపాలిటీ అభ్యర్థన మేరకు పోలీసులు విచారణ జరిపితే భూమిపై హక్కులకు సంబంధించిన వివాదం ఉందని తెలిసింది’ అని కోర్టుకు తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇది తీవ్రమైన హక్కుల వివాదమని, హక్కులు ఎవరివి అనే విషయాన్ని న్యాయస్థానంలో తేల్చలేమని అభిప్రాయపడ్డారు. కానీ.. అనుమతి లేకుండా డాక్టర్ యాదిగిరి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం మాత్రం చట్టపరమైన ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. పార్కింగ్, నిర్మాణాలపై మున్సిపాలిటీ ఇరుపక్షాల వారికీ నోటీసులు జారీ చేయాలని, అనంతరం విచారణ జరిపి తగినవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.