calender_icon.png 19 March, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టండి

19-03-2025 02:06:15 AM

  1. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలు అధిక శాతం తెలంగాణలోనే..
  2. ఐటీ, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశాల్లో రష్యా ప్రభుత్వంతో కలిసిపనిచేస్తాం
  3. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 
  4. మంత్రిని కలిసిన రష్యా ప్రభుత్వ ప్రతినిధుల బృందం

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అండగా ఉంటామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రష్యా ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాకాలను మంత్రి వారికి వివరించారు. ‘గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ ప్రాజెక్టులో రష్యా కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చొరవ చూపాలన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ప్రపంచస్థాయి నిపుణులను తయారు చేసేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల్లో అధిక శాతం తెలంగాణలో తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయన్నారు.

యూఎస్ తర్వాత అతిపెద్ద జీసీసీని అమెజాన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమన్నారు. టీహబ్, టీవర్క్స్ వంటి సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐటీ, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇతర అంశాల్లో రష్యా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు.

పౌరసేవలను ప్రజల ముంగిటకు చేర్చేందుకు రష్యాలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేస్తామన్నారు. సమావేశంలో రష్యా ప్రభుత్వ ప్రతినిధులు లిడ్‌మిలా ఒగారోడోవా, డిమిత్రీ స్టారోస్టిన్, రామిల్ ఖిస్మాటుల్లిన్, వెరా ప్రోంకినా, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్ పాల్గొన్నారు.