వైరా (విజయక్రాంతి): ఈనెల ఏడో తేదీ హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణలో భాగంగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష డప్పులు- వేల గొంతుకలు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ వారు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేయాలని.. మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలంటూ ఓరెత్తిన నినాదాలు చేశారు. బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ అంతా గత పది రోజులుగా ప్రతి ఒక్కరూ డప్పు చేతబూని డప్పు శబ్దాలతో కాలనీవాసులను చైతన్య పరుస్తున్నారు. యువకులు పెద్దలు అనే తారతమ్యం లేకుండా సమిష్టిగా ఫిబ్రవరి 7 హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణ రూపొందించి కాలనీ నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు. మూడు బస్సులు, పలు వాహనాల ద్వారా లక్ష డప్పులు- వేల గొంతులు కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు.