- రోడ్లు, నాళాలపై అక్రమ నిర్మాణాలు
- అనుమతి లేని ఇండ్లకు కరెంట్ మీటర్లు
- ప్రభుత్వ భూముల్లో కట్టడాలనూ అడ్డుకోని వైనం
- గత అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు
- న్యాయం చేయాలని ‘హైడ్రా’కు బాధితుల ఫిర్యాదు
సంగారెడ్డి, నవంబర్ 2౧ (విజయక్రాంతి): చెరువులకు పూర్వవైభవం తీసుకొ చ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈక్రమంలోనే స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా అధికారులు పరిశీలించి విచారణ అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి ఫిర్యాదులు స్వీకరించారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని వెంకటరమణ కాలనీ, శంభునికుంట, హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మారావునగర్‌తోపాటు పలు కాలనీల్లో రంగనాథ్ పర్యటించి ఆక్రమణలను పరిశీలించారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ నాయకులు, వారి అనుచురులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలున్నాయి.
పెద్ద చెరువు తూములు మూసివేత
అమీన్‌పూర్ పెద్ద చెరువు తూము, అలుగును మూసివేయడంతో నీటిమట్టం పెరిగి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి పెరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో చెరువుకు సమీపంలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో ప్లాట్లు కొన్నామని.. ప్రసుతం నీటిమట్టం పెరిగి ప్లాట్లు మునిగిపోయినట్టు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
నీటిపారుదల, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. కొందరు నాళాలపై నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. పెద్ద చెరువు కాల్వలను ఆక్రమించి కొత్త కాల్వలు ఏర్పాటు చేయడంతో వరద బయటికి వెళ్లడం లేదని స్థానికులు అంటున్నారు.
రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు?
అమీన్‌పూర్ పరిధిలో రోడ్లను ఆక్రమించి ఇండ్లు నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలించి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అయితే రోడ్లపై నిర్మాణాలు చేపట్టినా మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు నిలదీస్తున్నారు. అలాంటి ఇండ్ల నిర్మాణానికి ఎందుకు అనుమతులు ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నా రు.
నాయకులు, అధికారులు కలిసి అమీన్‌పూర్‌లో ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖలో పనిచేసిన కొందరు అధికారులు రియల్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకొని ఎన్‌వోసీలు ఇవ్వడంతోనే ఆక్రమణలకు పాల్పడినట్టు సమాచారం.
ముంపు బాధితులకు న్యాయం జరిగేనా?
అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులకు న్యాయం చేయాలని కొన్ని రోజులు గా ఆందోళన చేస్తున్నారు. తూముతోపాటు అలుగును మూసివేయడంతో నీటిమట్టం పెరిగి ప్లాట్లు నీటిలో మునిగిపోయాయని బాధితులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా 20వ లే ఔవుట్‌లో ఐదువేల కుటుంబాలకు చెందిన ప్లాట్లు నీటిలో మునిగిపోయినట్టు బాధితులు పేర్కొంటున్నారు.
చెరువు తూము మూసివేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది పెద్ద ప్రశ్న. అయితే చెరువు నీటిలో మునిగిన ప్లాట్లకు సంబంధించిన బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి పంపుతామని హైడ్రా కమిషనర్ తెలిపారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లాట్లు నీటిలో మునిగిపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కొన్ని రోజులుగా నిరసర తెలుపుతున్నారు.
అక్రమాలకు పాల్పడిన అధికారుల పై చర్యలు ఎక్కడ?
అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న క్రమంలో.. అసలు భవనాలకు అనుమతిచ్చిన, ఇంటి నంబర్, విద్యుత్తు మీటర్లు, నల్లా కనెక్షన్‌లు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. కొందరు రియల్ వ్యాపారులు పట్టా భూమితోపాటు పక్కనున్న ప్రభుత్వ భూములను అక్రమించి ప్లాట్లు వేసి విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నా యి.
గత అధికారులు రియల్ వ్యాపారులను ప్రోత్సహించడం వల్లనే ప్రభుత్వ భూములు కనుమరుగయ్యాయని పలువురు అంటున్నారు. చెరువు కాల్వలను అక్రమించిన వారితోపాటు అందుకు అనుమతులిచ్చిన అధికారులపై హైడ్రా అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.