ఎంపీ బలరాం నాయక్...
మణుగూరు (విజయక్రాంతి): ఈనెల 31న ఐటిసి పిఎస్పీడిలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టియుసి మిత్రపక్షాలు గెలుపు సాధించి ఐటీసీలో ఐఎన్టీయూసీ జెండా ఎగురవేయాలని మాజీ కేంద్రమంత్రి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(MP Porika Balram Naik) అన్నారు. శుక్రవారం సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ లో ఐఎన్టియుసి(INTUC) మిత్రపక్షాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పరంగా నా పరంగా ఐఎన్టీయూసీ కార్మిక సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహకారాలు అందిస్తామని అన్నారు.
ఐఎన్టియుసి మిత్రపక్షాల గెలుపుకై నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఐఎన్టియుసి మిత్రపక్షాలను గెలిపించుకుంటే ప్రభుత్వంచే యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చైనా సరే కార్మికులకు ఆమోద్యయోగమైన వేతనం ఒప్పందం చేసుకోవచ్చన్నారు. అనంతరం ఐఎన్టియుసి, మిత్రపక్షాల అధ్యక్షులు గోనె రామారావు, ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, యూనియన్ నాయకులతో పరిశ్రమలో జరగనున్న ఎన్నికల నిర్వహణ, పరిస్థితులు గురించి ఎంపీకి వివరించారు. తదనంతరం మోతిలాల్ అనే కార్మికుడు ఎంపీ బలరాం నాయక్ సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.