08-02-2025 01:58:25 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ భవన్ లో సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపైన ప్రజలు కోపంగా ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదన్నారు. ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని, తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఏమున్నదో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలకే కానీ చేతలకు కాదు అని అర్థమైందని ఆరోపించారు. తెలంగాణ నలుమూలలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత నెలకొని ఉందని, 140 ఎకరాల భూముల కోసం కొడంగల్ లోని ఒక ఊరికి 450 మంది పోలీసులను పంపించడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో పేదవాళ్లు బతక వద్దా..? వాళ్ళ ఇల్లులను, దుకాణాలను రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడని మండిపడ్డారు. దశాబ్ది కాలం పాటు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో పేదవాళ్ల గురించి ఆలోచించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తి చేశారు. 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కారం చేశారు. అధికారం లేకుండా అర్ధ రూపాయి డబ్బులు ఇవ్వకుండా 400 కిలోమీటర్లు కేసీఆర్ మీద ప్రేమతో హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్క సోదర సోదరీమణునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతామని కేటీఆర్ చెప్పారు. కానీ మీ అందరికీ అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్తాడు. కేసీఆర్ కూడా తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సిర్పూర్ కాగజ్ నగర్ తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందని, 2006 నుంచి 2009 వరకు అక్కడ పార్టీ బలోపేతం కోసం పని చేసినట్లు తెలిపారు. 2009లో శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రాష్ట్రంలో పది సీట్లు మాత్రమే గెలిచినా సిర్పూర్ కాగజ్ నగర్ లో కూడా గులాబీ జెండా ఎగిరిందన్నారు. కాగజ్ నగర్ లో ఉన్న ఏకైక పరిశ్రమ కాగజ్నగర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశామని చెప్పారు.పేపర్ మిల్లును ఓపెన్ చేసేందుకు ముంబాయి, కలకత్తా వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించామని, అనేక కంపెనీలను కలిసి జేకేతో మాట్లాడి పేపర్ మిల్లును తిరిగి ఓపెన్ చేయించడం జరిగిందని తెలిపారు. అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణ సమాజం గురించి… తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్తు తెలంగాణ గురించి ప్రవీణ్ కుమార్ ఆలోచనలు తన ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన అనేక అవకాశాలను, పదవులను వదులుకొని బహుజన అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు.
కేసీఆర్ తోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మారు. 8 మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచినా తెలంగాణకు తెచ్చింది.. దక్కింది శూన్యమని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీ నోరు మెదపలేదని విమర్శించారు. కానీ లోక్ సభలో గులాబీ దండు ఉండుంటే కేంద్రంపై కొట్లాడుతుండే వాళ్లమన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడు. కాగజ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనసులో ఉన్న మాట తనకు అర్థమైంది. ఇదే విషయాన్ని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ కార్యకర్తలు పనిచేసి అద్భుతమైన ఫలితాలను సాధించాలన్నారు.