calender_icon.png 12 January, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

06-08-2024 04:32:10 AM

  1. పరారీలో మరో ముగ్గురు 
  2. 2.955 కిలోల బంగారు నగలు, కారు స్వాధీనం 
  3. మధ్యప్రదేశ్‌కు చెందిన ఖంజర్ ఖెర్వా గ్యాంగ్‌గా గుర్తింపు

సంగారెడ్డి/జహీరాబాద్ ఆగస్టు 5 (విజయక్రాంతి): అంతర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 2.955 కిలోల బంగారు ఆభరణాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నట్టు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. సోమవారం జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ శివారులో ఉన్న కోహినూర్ దాబా వద్ద జూలై 26న అర్ధరాత్రి భోజనం కోసం నిలిపిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 2.955 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును దొంగిలించారు.

బాధితుడు చెరాగ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేయగా, దొంగలను పట్టుకునేందుకు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, సీసీఎస్ సీఐ మల్లేశం, ఎస్సై శ్రీకాంత్, చెరాగ్‌పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డి, ఎస్సైలు ప్రసాద్‌రావు, రామానాయుడు సిబ్బందితో కలిసి 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బుర్దిపాడు శివారులో ఓ కారును ఆపి తనిఖీ చేస్తున్న క్రమంలో కారులోని నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు పారిపోగా, ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన మాసూమ్ అలియాస్ ముస్తాక్ ఖాన్ (40)గా గుర్తించారు. పారిపోయిన వారు అష్రాఫ్, ఫెరోజ్, సాజిత్‌లుగా గుర్తించారు. నిందితులు ఖంజర్ ఖెర్వా గ్యాంగ్‌కు చెందినవారని ఎస్పీ తెలిపారు. నలుగురు నింది తులు దేశవ్యాప్తంగా దాబాలు, హోటళ్ల వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 2.955 కిలోల బంగారు నగలు, కారును స్వాధీనం చేసుకున్నామని, తప్పించుకున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.