07-04-2025 04:38:45 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడైన గజానంద్ పార్ధీ (45) ని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ సోమవారం బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. గత నెల 29న రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ప్రాంతంలో సాన శ్రావణ్ అనే వ్యక్తి ఇంట్లో తలుపులు పలుగగొట్టి ఇంట్లో ఉన్న 14.5 తులాల బంగారం, కిలోన్నర వెండి,రూ 20 వేల నగదుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అట్టే సుధాకర్ ఇంట్లో 5 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
బాధితుడు శ్రావణ శ్రావణ్ కు చెందిన బైకుతోపాటు అదే కాలనీలో నిలిపి ఉంచిన మరో 3 బైకులను ఎత్తుకెళ్లారని చెప్పారు. తమ ప్రాథమిక విచారణలో దొంగతనం పార్ధీ గ్యాంగ్ అని తేలడంతో మూడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఏర్పాటుచేసి బల్లార్ష, చంద్రపూర్, మహారాష్ట్ర ప్రాంతాలలో గాలించగా నిందితులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు ఏసిపి రవికుమార్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా గాలింపు జరుపుతుండగా సోమవారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం, గుణా జిల్లా, కనేర గ్రామానికి చెందిన గజానంద్ పార్ధీ అనే అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యున్ని పట్టుకున్నట్లు చెప్పారు. 12 మంది పార్ది గ్యాంగ్ సభ్యులు బెల్లంపల్లిలో రెక్కీ చేసుకొని దొంగతనం చేసి రైల్వే స్టేషన్ కి బైకులపై వెళ్లినట్లు చెప్పారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో బైకులను దాచి ఉంచి అక్కడి నుండి రైళ్లో కాజీపేట వెళ్లి 31న మరో దొంగతనం చేసినట్లు చెప్పారు.
గత నెల 31న దాచిన బైకులను తీసుకెళ్లేందుకు బెల్లంపల్లికి వచ్చి పోలీసులకు పట్టుబడ్డట్లు తెలిపారు. 15 మంది గ్యాంగ్ సభ్యులు కాజీపేటలో దొంగతనం చేసినట్లు పట్టుబడ్డ గజానంద్ పార్ధీ అంగీకరించినట్లు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీబీ రవికుమార్ వెల్లడించారు. తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులకు కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు గజానంద్ పార్టీ వద్ద నుండి 4 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బైకుల విలువ రూ లక్ష వరకు ఉంటుందన్నారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుణ్ణి చాకచక్యంగా పట్టుకున్న బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దిన్, బెల్లంపల్లి రూరల్, బెల్లంపల్లి టూ టౌన్, నెన్నల్ ఎస్సైలు చుంచు రమేష్, కె. మహేందర్, ప్రసాద్ లను ఏసీపి రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు.