11-04-2025 09:55:15 PM
పగలు చిరు వ్యాపారాలు, రాత్రి దారి దోపిడీలు ఈ ముఠా దందా..
నాలుగు కత్తులు, రెండు మొబైల్ ఫోన్లు, కర్రలు, రాళ్లు, బ్యాటరీలు స్వాధీనం..
ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): పగలు చిరు వ్యాపారం చేస్తారు. రాత్రులలో దొంగల అవతారం ఎత్తి జాతీయ రహదారులపై వెళ్లే వారిని ఆపి దోపిడీకి పాల్పడతారు. ఈ అంతర్ రాష్ట్ర దోపిడి దొంగల ముఠా ఆగడాలకు కామారెడ్డి పోలీసులు చెక్ పెట్టారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అంతర్రాష్ట్ర దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కూలీ కిషన్ పవార్, జాకి గుజ్జు బోస్లే, పవర్ హరీష్ అనురాగ్, రత్నప్ప బోస్లే, అంచనా, చూడి చూడి, చిరంజీవి, లతో పాటు మరో నలుగురు ఒక అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా ఏర్పడి జాతీయ రహదారుల పక్కన భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా కలిసి గుడారాలు వేసుకుని పగలు చిరు వ్యాపారాలు చేస్తున్నట్టుగా నటిస్తూ రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని వాహనాల అద్దాలను పగలగొట్టి వాహనదారులపై దాడి చేసి వారిని గాయపరిచి బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులు విలువైన వస్తువులను మొబైల్ ఫోన్లను దొంగలిస్తున్నారు.
ఇటీవల కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో నిద్రపోతున్న వ్యక్తులపై కారు అద్దాలు ధ్వంసం చేసి వారినీ బెదిరించి వారి వద్దనున్న నగదును ఎత్తుకెళ్లగా వారు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవునిపల్లి సీఐ రామన్ ఎస్ఐ రాజుల నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశారు. వీరిలో దేవునిపల్లి రూరల్ సీఐ రామన్, ఎస్ఐ రాజు, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, సిసిఎస్, సిఐ శ్రీనివాస్, ఐటీ కోర్ శ్రీనివాస్ ల నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయగా జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడ్డ అంతర్ రాష్ట్ర ముఠాపై నిఘా వేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. ఈ దొంగల ముఠా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డిచ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 44 జాతీయ రహదారిపై పలు నేరాలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాలోని ఏడుగురు పోలీసులకు చిక్కినట్లు మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పి పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ బ్యాగు 4 కత్తులు రెండు కర్రలు రెండు రాళ్లు రెండు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలిపారు. వీరిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో 165 ,310, 300, సెక్షన్లు, బి.ఎన్.ఎస్ (డికాయిటి) సెక్షన్ 25 (1) ఏ ఆర్ ఎమ్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వీరిని కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్పి వెల్లడించారు.
ఈ దొంగల ముఠా ఇతర రాష్ట్రాల్లో సైతం చోరీలకు పాల్పడ్డట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలోని ఏడుగురిని పట్టుకొని కేసును చేదించిన ఏఎస్పి చైతన్య రెడ్డితో పాటు సిఐలు రామన్ సంతోష్ కుమార్ శ్రీనివాస్ ఎస్సైలు రాజు రంజిత్ ఐటీ కోర్ శ్రీనివాస్ హెచ్ సి పి ఎస్ సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సిఐలు రామన్, సంతోష్ కుమార్, శ్రీనివాస్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.