calender_icon.png 18 January, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి అంతర్జాతీయకరణ

18-01-2025 01:46:34 AM

విదేశాల్లో ప్రత్యేక రూపీ అకౌంట్లకు ఆర్బీఐ అనుమతి

న్యూఢిల్లీ,  జనవరి 17: యూఎస్ డాలర్ తరహాలో రూపాయిని అంతర్జాతీయకరణ చేసేదిశగా రిజర్వ్‌బ్యాంక్ చర్యలు చేపట్టింది. అందులో తొలిచర్యగా ప్రవాసులు రూపాయిలకు రూపా యిలనే మార్పిడి చేసుకునేందుకు వీలుగా ప్రవాసులకు బ్యాంక్‌లు వాటి విదేశీ శాఖల్లో తాజాగా రూపీ ఖాతాలను తెరిచేందుకు అనుమతించింది. రూపాయిలనే స్వేచ్ఛగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుకల్పించే స్పెషల్ నాన్‌T రెసిడెంట్ రూపీ అకౌంట్, స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ (ఎస్‌ఆర్‌వీఏ) వంటి ఖాతాలను బ్యాంక్‌లు వాటి విదేశీ శాఖ ల్లో ప్రవాసులకు తెరుస్తాయి. ఎస్‌ఆర్‌వీఏ కార్యకలాపాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతి తప్పనిసరి. 

కన్వర్ట్‌బుల్ కరెన్సీగా రూపాయి

ఆర్బీఐ తాజాగా అనుమతిస్తున్న ఈ తరహా ఖాతాల ద్వారా రూపాయిలను కన్వర్ట్‌బుల్ కరెన్సీగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఎస్‌ఆర్‌వీఏలను 2022 జూలైలో ప్రవేశపెట్టారు. అప్పట్నుంచి పలు విదేశీ బ్యాంక్‌లు అటు వంటి ఖాతాలను ఇండియాలో బ్యాం క్‌ల వద్ద తెరిచాయి. స్థానిక కరెన్సీల్లో సీమాంతర లావాదేవీల్ని ప్రోత్సహించేదిశగా రిజర్వ్‌బ్యాంక్..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇండోనేషియా, మాల్దీవుల కేంద్ర బ్యాంక్‌లతో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసింది.

ప్రత్యేక ఖాతాలకు తాజాగా ఆర్బీఐ ఇచ్చిన క్లియరెన్స్‌తో భారతీయ బ్యాంక్‌లు వాటి విదేశీ శాఖల్లో దేశం వెలుపల నివాసితులకు రూపీ అకౌంట్లు తెరుస్తాయి. దీనితో ప్రవాసులు ఇండియాలో నివసించేవారితో అనుమతి పొందిన కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ లావాదేవీలను నిర్వహించుకోగలుగుతారు. 

ఎగుమతి, దిగుమతిదార్లకు వెసులుబాటు

ఆర్బీఐ అనుమతించిన ప్రత్యేక రూపీ ఖాతాల్లో నిల్వలను ఖాతాదారులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సహా విదేశీ పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు. అలాగే భారతీయ ఎగుమతి దారులు ఏ విదేశీ కరెన్సీలోనైనా వారి వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం, ఎగుమతి సొమ్మును తీసుకోవడానికి విదేశాల్లో ప్రత్యేక ఖాతాలను తెరవవచ్చు. ఆ ఖాతాల్లో పొందిన మొత్తాన్ని దిగుమతులకు చెల్లించవచ్చు.