07-03-2025 03:07:32 PM
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా(BJP Mahila Morcha) ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు కిషన్ రెడ్డి, డీకే అరుణ సన్మానించారు. ఈ సందర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను ఆరాధించే సంప్రదాయం మనది, మహిళలే ఇంటిని సమర్థంగా నడుపుతారని తెలిపారు.
భారతీయుల జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ప్రతిరంగంలో వివిధ హోదాల్లో మహిళలు పనిచేస్తూ అన్ని రంగాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ దేశాల్లోనూ ట్రిపుల్ తలాక్ లేదు.. మన దేశంలో ఉండేది. ట్రిపుల్ తలాక్(Triple talaq) పేరుతో ఆడబిడ్డలకు అన్యాయం చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదన్న కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నాయకత్వంలో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశామని వ్యాఖ్యానించారు.
త్వరలోనే ప్రధాని మోడీ నేతృత్వంలో జన గణన
త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జన గణన జరగబోతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరగబోతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థానాల్లో ఏ ఒక్క సీటు తగ్గకుండా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజన జరుగుతుందని హామీ ఇచ్చారు. కావాలనే రేవంత్ ప్రభుత్వం, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.