ధ్రువీకరించిన ‘జమాత్ ఉద్ దవా’
ఇస్లామాబాద్, డిసెంబర్ 27: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందినట్లు లష్కరే అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) ప్రకటించింది. మక్కీ కొద్దిరోజులుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ క్రమంలో ఆయ న్ను లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడని స్పష్టం చేసింది.
లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు మక్కీ స్వయాన బావమరిది. మక్కీకి తాలిబన్ నాయకుడు ఒమర్, అల్‌ఖైదా నాయకుడు అల్ జవహారీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. మక్కీకి ఇండియాలోని రామ్‌పుర, ఢిల్లీ, ముంబైలో చోటుచేసుకున్న ఉగ్రదాడులతో ప్రమేయం ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా మక్కీ అనేక ప్రదర్శనల్లో ప్రసంగించాడు.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడనే అభియోగాలతో 2020లో మక్కీ అరెస్టయ్యాడు. 2023లో మక్కీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మక్కీ ఆస్తులను స్తంభింపజేసింది. అలాగే అతడి అంతర్జాతీయ ప్రయాణాలను బ్యాన్ చేసింది.