calender_icon.png 13 January, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య

22-10-2024 01:51:39 AM

  1. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 
  2. 50 ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో ఏర్పాటు
  3. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

రాజేంద్రనగర్, అక్టోబర్21: పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ౫౦ ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.

సోమవారం సాయంత్రం మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీజీపీ జితేందర్, సీఎస్ శాంతికుమారి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక్కడ పోలీసు, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పీఎఫ్ తదితర విభాగాల ఉద్యోగుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా గ్రూప్ 1 అడ్డుకోవాలని ఎన్నోవిధాలుగా యత్నించాని ఆరోపించారు. తొలి రోజు 30 వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాశారని చెప్పారు. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తతతగా వ్యవహరించిందని మండిపడ్డారు.

యంగ్ ఇండియా పాఠశాల ద్వారా రాబోయే కాలంలో నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తామని వెల్లడించారు. ఉన్నతాధికారులు పక్కాగా ముందుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. హోంగార్డు పిల్లల నుంచి డీజీపీ పిల్లల వరకు యంగ్ ఇండియా స్కూల్‌లో చదువుకోవచ్చని తెలిపారు.

ఇతర ప్రాంతాల్లో ఎక్కడా ఇలాంటి సౌకర్యం లేదన్నారు. ఇది భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. గత బీఆర్‌ఎస్ సర్కారు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. పోలీసుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.

ఒక్కరోజూ కూడా సెలవులు తీసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. యువత బంగారు భవిష్యత్తు కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. తద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

నిరుద్యోగులకు మంచి చేసేందుకు గత పది నెలలుగా ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నట్టు స్పష్టంచేశారు. కొన్నిశక్తులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. గత సర్కారు జనం కోసం చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు పనిచేసినట్టు రాష్ట్రంలో పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా పాఠశాల నమూనాలను పరిశీలించారు. అదేవిధంగా పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కేంద్రియ విద్యాలయాలు నిర్వహించిన మాదిరిగా దీనిని నిర్వహించాలని కోరారు.

డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. పోలీసు సంస్మరణ దినోత్సవం రోజున యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.