calender_icon.png 26 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నగరంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టేడియం

08-08-2024 03:20:41 AM

  1. సీఎం ఆదేశాలతో గ్రేటర్‌లో స్థలాల పరిశీలన 
  2. 5 ఎకరాలకు పైనున్న స్థలాల గుర్తింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు ౭(విజయక్రాంతి): హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ ఇప్పటికే ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. భవిష్యత్తులోనూ ఈ మార్గా న్ని కొనసాగించడంతో పాటు మున్ముందు రెట్టింపు స్థాయిలో అగ్రభాగాన నిలిచి విశ్వవ్యాప్తంగా హైదరాబాద్ కీర్తి, ప్రతిష్ఠలు పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి దాకా క్రికెట్‌కు మాత్రమే అంతర్జాతీయ స్థాయి స్టేడియం కలిగిన హైదరాబాద్‌లో.. ఇతర క్రీడలకు సైతం ఇంటర్నే షనల్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 

ఇంటర్నేషనల్ స్థాయిలో.. 

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీల నిర్వహణకు ఎల్‌బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలు ఇప్పటికే ఉన్నాయి. క్రికెట్‌కు తప్ప ఇతర క్రీడలకు అంతర్జాతీయ స్థాయి హోదా కలిగిన స్టేడియం, మైదానాలు లేవనే చెప్పాలి. దీంతో క్రికెట్‌ను మినహాయించి ఏ క్రీడలోనూ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి అవకాశం లేకుండా ఉంది. ఒకటి, రెండు గ్రౌండ్లు ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు లేనందున కేవలం ఫుట్‌బాల్ ఆట కోసం కొత్తగా స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నగరంలో అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. నగరంలో ఫుట్‌బాల్ స్టేడియం ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. 

అనువైన స్థలం కోసం.. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు జోన్ల వారీ గా పలు స్థలాలను పరిశీలించారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా ఆ స్థలం ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా సూచనలు వచ్చాయి. దీంతో ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి  జోన్లలో దాదాపు 9 స్థలాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. వీటిలో అనువుగా ఉంద ని భావించిన స్థలంలో ప్రభుత్వం అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించేందుకు తదుపరి చర్యలు ప్రారంభించే అవకాశాలున్నాయి. గ్రేటర్‌లో మరో ఇంటర్నేషనల్ స్టేడియం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ క్రీడకు కూడా అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది.