హైదరాబాద్, జనవరి 19(విజయక్రాంతి): ఈనెల 20నుంచి 22వరకు ఎన్‌సీఈడీ-ఇండియా ఆధ్వర్యంలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు-2025 నిర్వహించనున్నారు. ఈ సదస్సును హెలెన్ కెల్లర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబలిటేషన్ ఫర్ ది డిసెబుల్‌డ్ చిల్డ్రన్ వారు సహకారంతో ఎన్‌సీఈడీ ఏపీ, తెలంగాణ చాప్టర్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లక్డీకపూల్ రెడ్‌హిల్స్‌లోని కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరై ప్రారంభిస్తారు. ప్రత్యేక అతిథిగా బధిరుల జాతీయ ఉన్నత కళాశాల(అలీ ఆవర్జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్, ముంబై) డైరెక్టర్, డాక్టర్ సుమన్ కుమార్ హాజరై దేశంలో బధిరుల కోసం అందుతున్న విద్య, ఉపాధి సదుపాయాల గురించి తెలియజేస్తారు.
ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన దాదాపు 400 మంది బధిరుల ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సులో 32 మంది తాము చేసిన పరిశోధనల వివరాలు వెల్లడిస్తారు. ముఖ్యంగా బధిరుల సమగ్ర విద్యావిధానంపై చర్చించనున్నారు.
సదస్సులో ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ జే లలిత, ఏవైజేఎన్‌ఐఎస్‌హెచ్‌డీ అసిస్టెంట్ డైరెక్టర్ బీ శ్రీనివాసరావు, డాక్టర్ మీరా సురేశ్, శిల్పి నారంగ్, ప్రొఫెసర్ పటాన్ ఉమర్ ఖాన్, డాక్టర్ డీ అర్ముగం పాల్గొననున్నారు. వివరాలకు 9396662158 నంబర్‌కు సంప్రదించాలన్నారు.