calender_icon.png 20 November, 2024 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తంలో అంతర్గత పోరు?

20-11-2024 03:15:29 AM

పీసీసీ చీఫ్ సభకు ఎమ్యెల్యే గూడెం, ఇన్‌చార్జి కాట డుమ్మా

సమావేశానికి హాజరైన నీల మధు

సంగారెడ్డి, నవంబర్ 19 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యం చేసేందుకు సంగారెడ్డి జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశాన్ని సోమవారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించారు. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతోపాటు సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జి ఏ.చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, పార్టీ నాయకుడు ఉజ్వల్‌రెడ్డి, నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, పటాన్‌చెరు నుంచి నీలం మధు, జిల్లాలోని నాయకులు సమావేశానికి హాజరయ్యారు.   

ముందే సమాచారం ఇచ్చినా..

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశానికి వస్తున్నారని ముందుగానే పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు సమాచారం ఇచ్చారని పార్టీ నేతలు చెపుతున్నారు. అయినా కూడా వారిద్దరూ పార్టీ మీటింగ్‌కు హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పటాన్‌చెరు ఎమ్మెల్యే పై అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారని అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు.

దీంతో ఎమ్మెల్యే గూడెం బీఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్‌చెరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాట శ్రీనివాస్‌గౌడ్‌కు, ఎమ్మెల్యే గూడెం మధ్య విభేదాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఇద్దరు నేతలు రాకపోవడంతో పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ఇస్నాపూర్ చౌరస్తాలో పీసీసీ చీఫ్‌కు ఘన స్వాగతం పలికి ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీ నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే గూడం మహిపాల్‌రెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.