- ఇకపై టెన్త్ పరీక్షలు 1౦౦ మార్కులకు
- ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
- విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్స్ బుక్‌లెట్
- విద్యాశాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షల విధా నాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఇప్పుడున్న ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. అలాగే గ్రేడింగ్ (టెన్ జీపీఏ) విధానాన్ని సైతం తీసేసింది. ఇకపై 100 మార్కులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
2025 మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం ఇంటర్నల్స్‌కు 20 మార్కులు, ఎక్స్‌టర్నల్స్‌కు 80 మార్కుల విధానం ఉంది. ఇక నుంచి మొత్తం 100 మార్కుల పేపర్లుంటాయి. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
అంతర్గత మూల్యాంకానికి మార్కులు కేటాయించకుండా వంద శాతం మార్కులను పబ్లిక్ పరీక్షలకే కేటాయించనున్నారు. గ్రేడింగ్ విధానంలో ఇచ్చే మార్కులు పారదర్శకంగా ఉండటంలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)తో విద్యార్థులకు రాతపని ఎక్కువగా ఇస్తున్నారు.
ప్రాజెక్టు వర్కులని, ఇతర రాతపని ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు చదువుకోడానికి సమయం ఉండటంలేదు. పైగా విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విధానంపై విద్యానిపుణులు, ఉపాధ్యాయులతో ఇటీవల తెలంగాణ విద్యాకమిషన్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. ప్రాజెక్టు వర్కులు, రాత పని తగ్గించాలని కమిషన్‌ను వారంతా కోరారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
24 పేజీల బుక్‌లెట్
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇకపై 24 పేజీలతో కూడిన ఆన్సర్స్ బుక్‌లెట్ ఇస్తారు. అందులోనే వారు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాలుగు పేజీల్లో రాసేవారు. ముందస్తుగా నాలుగు పేజీలతో కూడిన షీట్ ఇచ్చేవారు. దానితర్వాత అడిషనల్ ఇచ్చేవారు. పరీక్ష ముగిసిన తర్వాత ఆ పేజీలన్నింటికి ఒక దారంతో కట్టి ఇన్విజిలేటర్‌కు ఇచ్చేవారు.
ఈ ప్రాసెస్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ వేయకున్నా, దారం ఊడిపోయి.. జవాబు పత్రాలు మిస్ అయినా విద్యార్థులకు నష్టమే. అందుకే పేపర్ల స్థానాల్లో బుక్‌లెట్ విధానాన్ని తీసుకొచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సాంఘికశాస్త్రం పరీక్షలకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇస్తారు. మిగతా రెండు పేపర్లు అయిన భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి 12 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
మారనున్న ప్రశ్నల సరళి
ఇంటర్నల్ విధానాన్ని ఎత్తివేయడంతో ప్రశ్నల సరళి మారనుంది. సెక్షన్‌లు, ఏ ప్రశ్నలకు ఎన్ని మార్కులు ఉంటాయో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాల ప్యాటర్న్‌పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పాఠ్యాంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో సంబంధిత అధికారులు చెప్పాల్సి ఉంటుంది.
గతంలో ఉన్న ప్రశ్నల సరళి పూర్తిగా మారిపోనుంది. ఇదిలా ఉంటే, వార్షిక పరీక్షలు మార్చి నెలలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విధానంపై నిర్ణయం తీసుకోవడం విద్యార్థులకు కొంత ఇబ్బంది కరమే. మరోవైపు మాత్రం పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
బ్లూ ప్రింట్ విడుదల చేయాలి
పదో తరగతి పరీక్షల నూతన విధానానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా వెంటనే విడుదల చేయాలి. పదో తరగతిలో క్లిష్టమైన గ్రేడింగ్ విధానాన్ని తొలగించి, విద్యార్థులపై విపరీతమైన భారం పెంచుతున్న ఇంటర్నల్ విధానాన్ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ రెండు అంశాలు విద్యార్థులకు మేలు చేసేవే. మిగిలిన తరగతులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలి.
రాజభాను చంద్రప్రకాష్,
హెచ్‌ఎం అసోసియేషన్ అధ్యక్షులు