08-04-2025 12:48:14 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 7 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తరాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా నిప్పు నీరుల కస్సు బస్సు అంటున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని గడగడలాడించారని పేరున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రత్యేక రాష్ట్రం కోసం టిడిపితో విభేదించి నగారా పార్టీని స్థాపించి తన సత్తా చాటుకున్నారు.
స్వరాష్ట్రం తర్వాత బిజెపి పార్టీలోకి వెళ్లి ఉమ్మడి పాలమూరు ఎంపీ స్థా నం నుండి పొటీ చేస్తూనే తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్ ఇప్పించి ఇరువురూ ఓటమి చెందా రు. ఆ తర్వాత తగిన ప్రాధాన్యత లభించలేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయ ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తన రాకను వ్యతిరేకిస్తూ టిఆర్‌ఎస్ పార్టీలో చేరి మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించుకున్నారు.
ఈ క్రమంలో మర్రి జనార్దన్ రెడ్డి వద్ద తగిన ప్రాధాన్యత లభించలేదని తనకు అవమానం జరిగిందన్న ఉద్దేశంతో కూచుకుల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతోపాటు తన కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డికే పార్టీ అధిష్టానం మొగ్గుచూపడంతో ఆగ్రహించిన నాగం జనార్దన్ రెడ్డి కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని ఓడించాలన్న ఉద్దేశంతో పదేళ్లపాటు ప్రత్యర్థిగా భావించిన మర్రి జనార్దన్ రెడ్డి గెలిపించేందుకు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి కార్యవర్గం నువ్వా నేనా అన్న విధంగా అడుగులు వేస్తూ వచ్చారు. శుభకార్యాలు ఓదార్పుల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి వేరువేరుగా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
తాజాగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కార్యకర్తలు ముఖ్య నేతలు పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఫోటోలు కనిపించకపోవడంతో బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరు బహిర్గతమవుతోందని స్పష్టం అవుతోంది. నాగం శశిధర్ రెడ్డి వర్గం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలోనూ మర్రి జనార్దన్ రెడ్డి ఫోటోలు కనిపించకపోవడంతో రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలా వర్గ పోరు తారాస్థాయికి చేరిందనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 14 నెలలు గడుస్తోం దని ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మాజీ ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీని నమ్మి ఓట్లేసిన ప్రజలంతా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్లపాటు అధికా రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన అహంకారపూరిత నిర్ణయాలతో ఓటమి చెంది ప్రజలే తనను ఓడించి తప్పు చేశారన్న భావనతో ఉన్నారని తనను అభిమానించే నేతలు గుసగుసలాడుతున్నారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డి వర్గం మాత్రం తమకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో ప్రజా సమస్యలపై కొట్లాడే అవకాశం లేదంటూ సాకులు వెతుకుంటున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లో జరగనున్న మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి, సర్పంచ్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గ పోరు తీవ్ర ఇబ్బందులను నెలకొల్పే ప్రమాదం లేకపోలేదని బిఆర్‌ఎస్ పార్టీ అభిమానులు సామాన్యులు చర్చించుకుంటు న్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తన తనయుడు నాగం శశిధర్ రెడ్డి వర్గం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వర్గాలు పూర్తిగా ఎటు తేల్చుకోలేక పోతున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం భవిష్యత్తు మనదేనంటూ రెండు వర్గాల ముఖ్య నేతలకు చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది.