22-02-2025 12:51:04 AM
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి
కొండపాక,ఫిబ్రవరి 21: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలలో 20595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సుపరిండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల ను ఏర్పాటు చేసి, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసి, అన్ని పరీక్ష కేంద్రాలలో ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉన్నందువలన పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా, అవసరమైన మార్గాలలో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
కమిషనర్ ఆఫ్ పోలీస్ డా, అనురాధ తో కలిసి ఇంటర్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్, రెవెన్యూ అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్ రెడ్డి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పల్వన్ కుమార్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.