calender_icon.png 23 December, 2024 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేళ్లలో 26 మందేనట!

23-12-2024 02:10:40 AM

ఇది 2020-24 మధ్య ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య  

  1. సమాచార హక్కు చట్టానికి ఇంటర్మీడియట్ బోర్డు స్పందన
  2. బోర్డు గణాంకాలపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఒకవైపు ఇంటర్ ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కల్గిస్తుంటే.. ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం ఆ స్థాయిలో ఆత్మహత్యలే జరగలేదన్నట్టు వివరాలు ఇవ్వడం ఆశ్చర్యం కల్గిస్తున్నది.

గత నాలుగేళ్లలో ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు 26 మందేనని బోర్డు చెప్పడంపట్ల  విద్యార్థి సంఘాలు మండిపడు తున్నాయి. 2020 నుంచి 2024 నవంబర్ వరకు ఎంత మంది విద్యార్థులు ఇంటర్ ప్రైవేట్ కాలేజీల్లో చనిపోయారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచార హక్కు చట్టం కింద కోరింది.

దీనిపై స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు నాలుగేండ్లలో మొత్తం 26 మంది విద్యార్థులు మాత్రమే చనిపోయినట్టు సంస్థకు జవాబు ఇచ్చింది. ఇంటర్ బోర్డు వివరాలు చూసిన సదరు సంస్థ ‘ఇదేం రిపోర్టు.. ఇదేం శాఖ’ అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసింది. పైగా అధికారులు తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ఇంతేనని చేతులుదులుపుకునే ప్రయత్నం చేసినట్టు సంస్థ ఆరోపించింది.

ఒత్తిడి భరించలేకనే.. 

విద్యా సంవత్సరం ప్రారంభమై, ముగిసే వరకు విద్యార్థుల ఆత్మహత్యలు నిత్యం ఎక్కడోచోట, ఏదో ఒక కాలేజీ లో జరుగుతున్నట్టు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కార్పొరేట్ చదువుల ఒత్తిడి భరించలేకనే రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే ఆర్పోణలు బహిరంగ రహస్యమే.

చదువుల పేరిట పిల్లల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నారు. రూ.లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుంటూనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. మార్కులు, ర్యాంకుల పేరుతో 16 గంటలకు పైగా చదివిస్తు విద్యార్థులపై మానసిక ఒత్తిడికి లోను చేస్తున్నారు. 

ఆశ్చర్యపోయేలా ఇంటర్ బోర్డు వివరాలు 

రాష్ర్టంలో 2020 నుంచి 2024 నవంబర్ వరకు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు?  సంవత్సరాల వారీగా, కళాశాలల వారీగా పేర్లు సహా సంఖ్యాపరంగా పూర్తి వివరాలు అందించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుకు ఇంటర్ బోర్డు సమాచారం ఇచ్చింది.

కానీ, ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్యపోయేలా ఉంది. తమ దగ్గర జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది. ఆదిలాబాద్, హనుమకొండ, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఆత్మహత్య ఘటనలు చేటుచేసుకున్నట్టు బోర్డు అధికారులు పేర్కొన్నారు.

2024లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో విద్యార్థుల ఆత్మహత్యలు కేసులు బాగా పెరిగాయనే వార్తలు వచ్చాయి. కానీ, ఇంటర్ బోర్డు ఇచ్చిన వివరాల ప్రకారం ఆ రెండు జిల్లాల్లో 12 మంది మాత్రమే చనిపోయినట్టు సమాచారం ఇచ్చారు. నిజంగానే ఇంతే మంది ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే లెక్కల్లో ఏమైనా తేడాలున్నాయా? అని చర్చనీయాంశంగా మారింది. 

ఆత్మహత్యలకు కారణాలు

* ఇంటర్ బోర్డు ఇచ్చిన వివరాల్లో 26 మందిలో కొంత మంది విద్యార్థులు ఏ కారణాలతో చనిపోయారో కూడా స్పష్టం చేసింది. 

* వ్యక్తిగత సమస్యలు, ఫస్టియర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, చదువు బాగాలేదని, హాస్టల్‌లో ఉండేందుకు భయపడి, ఆరోగ్య సమస్యలు, మనస్థాపంతో చనిపోయినట్టు తెలిపింది.

* రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఉండేందుకు ఇష్టంలేక..

* కుటుంబ సమస్యల కారణంగా కొందరు బలవన్మరణం 

* మార్కుల కోసం ఉపాధ్యాయుల ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఇలా వివిధ కారణాలతో విడ్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు బోర్డు తెలిపింది.  

విద్యార్థుల మరణాలు లెక్క ఉండదా?  

కార్పొరేటు కళాశాలల ఒత్తిళ్లకు, ఆగడాలకు ఎంతోమంది విద్యార్థులు నేలరాలిపోతున్నారు. ఈ సంవత్సరంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పేరుమోసిన కాలేజీలు చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థుల ప్రాణాలను బలితీస్తున్నాయి.

2020 నుంచి 2024 వరకు రాష్ర్టంలో ఎంతమంది విద్యార్థులు కార్పొరేటు కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నిస్తే అందుబాటులో ఉన్న సమాచారమే ఇస్తున్నామని చెప్పి చేతులు దులుపుకోవడాన్ని చూస్తుంటే ఇంటర్మీడియట్ బోర్డుకు విద్యార్థుల ప్రాణాలంటే ఎంత విలువ ఉందో అర్థమైపోతుంది.

 రాజేంద్ర పల్నాటి, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు 

జిల్లాలవారీగా ఇలా..

ఆదిలాబాద్ 1

హనుమకొండ 4

ఖమ్మం 2

సిద్దిపేట 2

సంగారెడ్డి 2

సూర్యాపేట 1

మహబూబ్‌నగర్ 2

రంగారెడ్డి 5

మేడ్చల్ 

మల్కాజిగిరి 7