23-03-2025 12:00:00 AM
ప్రస్తుత కాలంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో పిల్లలతో పాటే పెద్దలూ ఉండేవారు. ప్రస్తుతం పిల్లలు ఉన్నత విద్యకు, ఉద్యోగాలు చేస్తూ విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వారు అక్కడే స్థిరపడుతుండడంతో వృద్ధులు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వారి అవసరాలకు తీర్చేలా పలు సంస్థలు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం..
ఇంటి నిర్మాణంలో అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మా ర్పులు వస్తున్నాయి. జనాభాలో వృద్ధుల (సీనియర్ సిటిజన్ల) సంఖ్య పెరుగుతుండటం తో వీరి అవసరాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు రిటైర్‌మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నాయి.
ఇంటి డిజైన్‌లో వారికి తగిన సౌక ర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకంగా నిర్మాణాలు చేపడుతున్నాయి. వారి అవసరాలకు కావాల్సిన విధంగా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉల్లాసంగా గడిపేలా ఈ ఇళ్లను తీర్చిదిద్దుతున్నారు. నిర్వహణ తేలిగ్గా ఉండేలా ఇంటిని తక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తూ ఇతర అవసరాలకు ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు.
సీనియర్ లివింగ్ విభాగం..
ఒక వయసు వచ్చాక సాధారణ ఇళ్లలో నివసించడం పెద్దలకు అంత సౌకర్యంగా ఉండదు. వీటిని దృష్టిలో పెట్టుకునే సీనియర్ లివింగ్ విభాగం వచ్చింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి ఇళ్ల నిర్మాణం బాగా ప్రాచుర్యం పొందింది. వీటిల్లో వృద్ధుల భద్రతే ధ్యేయంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వయోభారం పెరుగుతున్న కొద్దీ శరీరపటుత్వం కోల్పోయి ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ఇంట్లో వాతావరణం అందుకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. వారి అవసరాలకు అనుగుణంగా నిర్మాణంలో, ఇంటీరియల్ డిజైన్లలో మార్పులు చేయించుకోవాలి.
రౌండ్ ఎడ్జ్ ఫర్నిచర్
ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా సోఫాలు, కుర్చీలకు దృఢంగా రౌండ్ ఎడ్జ్‌లు వచ్చేలా ఫర్నిచర్ రూపొందిస్తున్నారు. దీంతో అవి వృద్ధులు పట్టుకోవడానికి వీలుగా ఉంటున్నాయి. అలాగే వీరి కోసం ప్రత్యేకంగా మినీ కిచెన్ డిజైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కూర్చొని వంట చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
ఫ్లోరింగ్
వృద్ధుల్లో అనేక మంది బాత్‌రూమ్‌లో జారి పడుతుంటారు. ఈ పరిస్థితి లేకుండా యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్, చేతికందేలా క్లోజెట్‌లు, కూర్చొని స్నానం చేసేలా స్టూల్ లేదా సీటింగ్ డిజైన్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి. హాట్, కోల్డ్‌బర్న్‌లను నివారించేలా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు చేసే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.
సెన్సార్ లైటింగ్
వయోభారం కొద్దీ వృద్ధుల్లో కంటి చూపు మందగిస్తుంది. చేయి పట్టుకుని నడిపించేవారు దగ్గర లేకపోతే నడవడం కష్టమే. సాహసం చేసి నడిచినా ప్రమాదపుటంచున పయనించినట్టే. విద్యుద్దీపాల స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయడానికి వెళ్లే క్రమంలోనూ వస్తువులు తగిలి గాయాలు కావడం, ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మోషన్ సెన్సార్ లైట్ల వినియోగానికి ఎక్కువమంది ప్రాధాన్యమిస్తున్నారు. మనిషి కదలికలను బట్టి ఇవి ఆన్, ఆఫ్ అవుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. మోకాళ్ల నొప్పులతో మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడేవారి కోసం అవసరమైన చోట ర్యాంపులు, వీట్‌ఛైర్ పట్టేలా తలుపుల వరకు నిర్మాణం వంటివి చేస్తున్నారు.
మంచి నిద్రకు..
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల మ్యాట్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. వెన్ను సమస్యలు, రుమాటిక్ నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉండటం వల్ల సరిగా నిద్రించలేని వృద్ధులకు అవి మంచి పరిష్కారం. ఈ హైటెక్ ఫర్నిషింగ్స్ సరైన పొజిషన్‌ను ఇచ్చి నిద్ర సమస్యలను దూరం చేస్తాయి. అలాగే మంచం కూడా వారికి తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. వీలైనంతవరకు వారి గది సౌండ్ ప్రూఫ్ చేయించడం మంచిది.