calender_icon.png 29 December, 2024 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసక్తికరంగా రుడా చైర్మన్ పదవి

03-11-2024 12:57:43 AM

  1. రామగుండం నుంచి పెరుగుతున్న ఆశావహులు 
  2. తెరపైకి కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు పేరు

పెద్దపల్లి, నవంబర్ 2 (విజయక్రాంతి): రామగుండం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ పదవికి పోటీ నెలకొంది. గత నెల ౧౫న రుడా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం గెజిట్ విడుదల చేసింది. చైర్మన్ పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మ రం చేసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాను కలుపుతూ ఏర్పాటు కాబోతున్న రుడా కార్యాల యం ప్రస్తుతం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోనే కొనసాగించే అవకాశం ఉంది. రెండేళ్ల కాల పరిమితితో రుడాకు చైర్మన్ పదవిని ప్రభుత్వం నామినెటెడ్ పద్ధతిలో కట్టబెట్టనుంది. అయితే, ప్రస్తుతం రుడా చైర్మన్‌గా కలెక్టర్ కోయ శ్రీహర్ష, వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ వ్యవహరించనున్నారు. 

చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు

రుడా పాలక వర్గం ఎన్నికకు ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాకపోయినా.. రామగుండం నుంచి అప్పుడే కాంగ్రెస్ సీనియర్లు క్యూ కడుతున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు, కార్పొరేటర్ కొలిపాక సుజాత చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

రామగుం డం నుంచి కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు, పాతపెల్లి ఎల్లయ్య, కాల్వ లింగస్వామి, ఎం రవికుమార్, బొంతల రాజేశ్  కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీరిలో పాతపెల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు గతంలో ఇతర పార్టీలో ఉండి నాడు కాంగ్రె స్ పార్టీపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

వాటిని పరిగణలోకి తీసుకుంటే చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇక కాల్వ లింగస్వామి సింగరేణి ఉద్యోగి కావడంతో ఆయనకు కూడా పదవి అంత తేలికగా వచ్చే అవకాశం కనిపించట్లేదు. రుడా చైర్మన్ పదవిలో కొనసాగాలంటే పాలన వ్యవహారాలపై పూర్తిస్థాయి పట్టు కలిగి ఉండాలి.

ఆ అర్హతలను పరిగణలోకి తీసుకుంటే ఆ పదవికి సమఉజ్జీలు ఎవరు ఉన్నా రనేది ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. మంథని నియోజకవర్గం నుంచి సీని యర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం కల్పించాల్సి వస్తే రామగిరి మండలం కల్వచర్లకు చెందిన రామగుండం కార్పొరేటర్ కొలిపాక సుజాతకు ఇచ్చే చాన్స్ ఉంది. 

తెరపైకి శ్రీనుబాబు పేరు! 

కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబుకు రుడా చైర్మన్ పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. రామగుండం నుంచి కాంగ్రెస్ లో పలువురు సీనియర్లు రుడా చైర్మన్ పదవి ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి కట్టబెట్టినా వర్గ విభేదాలు పొడచూపే అవకాశం ఉంది.

అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అందరూ ఏకీభవించే వ్యక్తినే రుడా చైర్మన్ పదవి కోసం నామినేట్ చేయాలన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుకు రుడా పదవి ఇస్తే పార్టీలో ఎలాంటి వ్యతిరేకత రాదని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

రామగుండం ఎమ్మెల్యేకు సమీప వ్యక్తినే ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతున్నది. తుది నిర్ణయం మంత్రి శ్రీధర్ బాబు చేతుల్లోనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.