హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి (కేటీఆర్) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు ముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఫార్ములా-ఈ(Formula-e race)ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్(Hyderabad) నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని తేల్చిచెప్పారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటం(Sport World Map)లో నిలిపిందన్న కేటీఆర్ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలని సూచించారు. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను: రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందన్నారు. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతి నయా పైసాకు లెక్క ఉందని స్పష్టం చేశారు. మరి అలాంటి సమయంలో ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని కేటీఆర్ విమర్శించారు. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయన్నారు. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు(BRS Working President KT Rama Rao) ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు హాజరయ్యారు. కెటిఆర్ వాస్తవానికి జనవరి 7 న ఏజెన్సీ ముందు హాజరు కావాల్సి ఉంది, అయితే ఆలస్యం కోరడంతో, జనవరి 16 న హాజరుకావాలని ఈడీ అధికారులు కొత్త నోటీసు జారీ చేశారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఇతరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) నమోదు చేసింది. ఫార్ములా-ఈ నిధుల కేసులో కేటీఆర్‌తో పాటు మరికొందరిపై తెలంగాణ ఏసీబీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయడంతో ఈడీ ఈసీఐఆర్ దాఖలు చేసింది.