- గ్రామీణ ఇంజినీరింగ్ కాలేజీలను పట్టించుకోని విద్యార్థులు
- మేనేజ్‌మెంట్ కోటాలో 6 వేల సీట్లు ఖాళీ
- 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు
- మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ కాని ఒక్క సీటు
- కన్వీనర్ కోటాలోనూ 10లోపు మాత్రమే
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కొన్ని జిల్లాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు నిండడంలేదు. అందులోనూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు అసలే నిండని పరిస్థితి. జిల్లాల్లోని 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో ఒక్క సీటూ భర్తీ కాలేదు. అలాగే కన్వీనర్ కోటాలోని సీఎస్‌ఈ అనుబంధ కోర్సులు, సివిల్, మెకానికల్, ఈఈఈ లాంటి కోర్సుల్లోనూ 10లోపే సీట్లు భర్తీ అయ్యాయి.
జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో ఉండే ఇంజినీరింగ్ కాలేజీలకు పెద్దగా ఆదరణ ఉండటంలేదు. దీంతో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడంలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అందులో ప్రవేశాలు పొందేందుకు ఇష్టపడట్లేదు. రాష్ట్రంలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలుంటే, అందులో ప్రైవేట్ కాలేజీలు 154 ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం సీట్లు 1.08 లక్షల సీట్లుంటే, కన్వీనర్ కోటా సీట్లు పోనూ.. దాదాపు 36 వేల వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నా యి. 2024 విద్యా సంవత్సరానికి సం బంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 11న చేపట్టారు. తుది విడత కౌన్సిలింగ్ కూడా ముగిసిం ది.
ఆతర్వాత 154 ప్రైవేట్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే ప్రైవేట్ కాలేజీలు ఆ సీట్లను భర్తీ చేసిన అనంతరం వాటిని ఉన్నత విద్యామండలి నుంచి ర్యాటిఫికేషన్ (అనుమతి) తీసుకోవాల్సి ఉంటుంది.
ఈక్రమం లోనే 10 కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సున్నా అడ్మిషన్లు నమోదైనట్లు, కన్వీనర్ కోటాలోనూ 10 మంది లోపు మాత్రమే ప్రవేశాలు పొందినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే కాలేజీల్లో సీట్లు భర్తీ అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు.
డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో సైతం సీట్లు భర్తీ కావడంలేదు. అయితే ప్రస్తుతం ర్యాటిఫికేషన్ ప్రక్రియ చేపడ్తున్న ఉన్నత విద్యామండలి మేనేజ్‌మెంట్ కోటా కాకుండా.. కన్వీనర్ కోటాలో 10 మంది లోపు విద్యార్థులు చేరిన కాలేజీలపై దృష్టి సారించింది.
10 మంది, ఆలోపు చేరిన బ్రాంచ్‌లను ఆయా కాలేజీలు కొనసాగిస్తాయా? లేకపోతే ఇతర కాలేజీల్లోకి పంపిం చడానికి సుముఖత చూపుతాయా? అనేది చూడాల్సి ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. చేరిన కొంత మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తామంటే బ్రాంచ్‌లను కొనసాగించేలా చర్యలు తీసుకుంటారు.
లేదంటే ఇతర కాలేజీల్లోకి ఆయా విద్యార్థులను మార్చాలని కోరితే దానికనుగుణంగా ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటుంది.