calender_icon.png 23 October, 2024 | 2:57 PM

ఎఫ్‌డీలపై 8.5% వరకూ వడ్డీ

07-07-2024 01:00:18 AM

జూలైలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, యెస్ బ్యాంక్ రేట్లు ఇవే..

పలు పెద్ద బ్యాంక్‌లు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను గత కొద్ది వారాలుగా సవరించాయి. ఈ సవరణల ప్రకారం జూలై నెలలో అమల్లో వున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లు అందిస్తున్న రేట్లలో కొంత వ్యత్యాసం ఉన్నది. పీఎస్‌యూ బ్యాంక్‌లు 8 శాతం వరకూ వడ్డీ రేటును అందించే స్పెషల్ ఎఫ్‌డీలో మదుపు చేసేందుకు నిర్దేశిత చివరితేదీని పొడిగించాయి. ఆయా బ్యాంక్‌ల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు వివిధ కాలపరిమితు లుగల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాత ం7.10 శాతం మధ్య వడ్డీ రేటును అం దిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు మరో అరశాతం అధికంగా 4 శాతం నుంచి 7.60 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది.  ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన స మాచారం ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యే క కాలపరిమితిగల ఎఫ్‌డీపై (అమృత్ కలశ్) సాధారణ పౌరులకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. 2024 సెప్టెంబర్ 30 వరకూ ఈ స్పెషల్ డిపాజిట్‌లో మదుపు చేసుకోవచ్చు. 

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ప్రవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంక్ వివిధ కాలపరిమితులుగల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెగ్యులర్ సిటిజన్లకు 3 శాతం నుంచి 7.20 శాతం వడ్డీని ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటు 3.50 శాతం నుంచి 7.75 శాతం మేర ఉన్నది. ఈ బ్యాంక్ అధిక వడ్డీని ఆఫర్ చేసే ఎఫ్‌డీ కాలపరిమితి 15 నెలల నుంచి 18 నెలలలోపు ఉంటుంది. ఈ ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 7.20 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు 2024 జూలై 5 నుంచి అమలులోకి వచ్చాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

రెగ్యులర్ సిటిజన్లకు 3 శాతం నుంచి 7.25 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకూ వివిధ కాలపరిమితులుగల డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. అధికంగా వడ్డీ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి 18 నెలల నుంచి 21 నెలల లోపు ఉంటుంది. ఈ ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తున్నది. జూలై 5 నుంచి ఈ రేట్లు వర్తిస్తాయి.

పీఎన్‌బీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ కాలపరిమితులుగల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకూ వడ్డీని అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం వరకూ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. అధిక వడ్డీ రేటు 400 రోజుల ప్రత్యేక కాలపరిమితిగల డిపాజిట్‌పై రెగ్యులర్ సిటిజన్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. 2024 జూన్ 10 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. 

యెస్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు

రెగ్యులర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 8 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8.50 శాతం వరకూ వివిధ కాలపరిమితులుగల డిపాజిట్లపై యెస్ బ్యాంక్ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. అధికంగా వడ్డీ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి 18 నెలలు.  ఈ ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీని అందిస్తున్నది. జూన్ 8 నుంచి ఈ రేట్లు వర్తిస్తాయి. 

కెనరా బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ 7 రోజుల నుంచి పదేండ్ల కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 7.25 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నది. అధిక వడ్డీ రేటు 444 రోజుల కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా లభిస్తుంది. ఈ ఎఫ్‌డీపై రెగ్యులర్ సిటిజన్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సవరించిన రేట్లు జూన్ 11 నుంచి అమలులోకి వచ్చాయి.