calender_icon.png 26 December, 2024 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ రేట్లు యథాతథం? సీఆర్‌ఆర్ కోత!?

05-12-2024 12:00:00 AM

  1. రిజర్వ్‌బ్యాంక్ పాలసీపై అంచనాలు
  2. ప్రారంభమైన సమీక్షా సమావేశం
  3. రేపు నిర్ణయం వెల్లడి

ముంబై, డిసెంబర్ 4: ఒకవైపు ద్రవ్యోల్బణం పెరగడం, మరోవైపు జీడీపీ వృద్ధి రెండేండ్ల కనిష్ఠస్థాయికి తగ్గిన నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ పాలసీపై భిన్న అంచనాల నడుమ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమయ్యింది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్ గరిష్ఠసహన స్థాయి 6 శాతాన్ని మించి 6.21 శాతానికి పెరగ్గా, ఈ జూలై-సెప్టెంబర్ ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అనూహ్యంగా రెండేండ్ల కనిష్ఠస్థాయి 5.4 శాతానికి పడిపోయింది.

ద్రవ్యోల్బణం 4 శాతం సమీపానికి దిగిరానందున రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీడీపీ వృద్ధి పడిపోయినందున రేట్లను పావుశాతం తగ్గించవచ్చన్న అంచనాల్ని కూడా మరికొందరు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ  రెపో రేటు 6.5 శాతంగా ఉన్నది.

2023 ఫిబ్రవరి నుంచి ఇదేస్థాయి వద్ద రెపో రేటు కొనసాగుతున్నది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ మూడు రోజులపాటు చర్చలు జరుపుతుంది. నిర్ణయం శుక్రవారం ఉదయం వెలువడుతుంది. 

వచ్చే ఏడాదే రేట్ల తగ్గింపు: ఎస్బీఐ రీసెర్చ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రేట్ల ఉండబోదని ఎస్బీఐ తాజా రీసెర్చ్ రిపోర్ట్‌లో అంచనాల్ని వెల్లడించింది. తొలి రేట్ల కోత 2025 ఏప్రిల్‌లో ఉంటుందని పేర్కొంది. ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు పడిపోయినందున రేట్ల కోత వంటి విధాన చర్యలకు దారితీస్తుందని భావించడం లేదని, ప్రధాన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతున్నందున రేట్లలో మార్పు ఉండకపోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ వివరించింది.

ఇదే అభిప్రాయాన్ని బేసిక్ హోమ్‌లోన్ సీఈవో అతుల్ మొంగా వ్యక్తంచేస్తూ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, ఆర్థికాభివృద్ధికి మద్దతునిచ్చేందుకు రెపో రేటును మార్చకపోవచ్చని అంచనా వేశారు. రెపో రేటును యథాతథంగా ఉంచినా, హౌసింగ్ డిమాండ్ ప్రత్యేకించి మిడ్‌రేంజ్ లగ్జరీ విభాగాల్లో డిమాండ్  స్థిరంగానే ఉంటుందని మొంగా వివరించారు. 

ద్రవ్యోల్బణమే విలన్ 

అనిశ్చిత అంతర్జాతీయ స్థితిగతులు, గరిష్ఠ ద్రవ్యోల్బణం కారణంగా ఎంపీసీ రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ అంచనా వేశారు. క్యూ2లో జీడీపీ బాగా తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణం పెరిగినందున ఎంపీసీ డిసెంబర్ సమీక్షలో రేట్లను మార్చబోదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. 

సీఆర్‌ఆర్ కోతకే మొగ్గు

ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు వడ్డీ రేట్ల కోత బదులు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంపొందించేందుకు ఆర్బీఐ సీఆర్‌ఆర్ కోతకే మొగ్గుచూపుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ సబ్సిడరీ ఎస్‌బీఎం బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరీ హెడ్ మందార్ పిటలే అంచనా వేశారు.

వచ్చే ఎంపీసీ సమావేశం వరకూ సీఆర్‌ఆర్‌ను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించవచ్చని అంచనాల్లో పేర్కొన్నారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) కొనుగోళ్ల ద్వారా లిక్విడిటీని పెంచాలని ఎంపీసీ నిర్ణయించవచ్చని మందార్ పిటలే చెప్పారు. 

శక్తికాంత్ దాస్‌కు చివరి ఎంపీసీ మీట్

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రస్తుత  పదవీ కాలం డిసెంబర్ 10తో ముగుస్తుంది. అందుచేత ఆయన అధ్యక్షతన జరిగే చివరి ఎంపీసీ సమావేశం ఇదే అవుతుంది. ఎంపీసీలో ముగ్గురు ఆర్బీఐ అధికారులు, మరో ముగ్గురు కేంద్రం నియమించిన స్వతంత్ర సభ్యులు ఉంటారు.

ప్రస్తుతం ఎంపీసీలో ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ నగేశ్‌కుమార్, ఆర్థికవేత్త సౌగంధ భట్టాచార్య, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్‌లు స్వతంత్ర సభ్యులుకాగా, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేబబ్రత పాత్ర, గవర్నర్ శక్తికాంత్ దాస్‌లు కేంద్ర బ్యాంక్ సభ్యులు.