08-02-2025 12:41:39 AM
రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ ఐదేళ్ల తర్వాత తొలిసారి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (పావుశాతం)తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.
ఇటీవలి బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్యసమీక్షపై అటు వ్యాపార-పారిశ్రామిక రంగాలు, ఇటు బ్యాంకర్లు- రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది ఆర్‌బీఐ.
తాజా నిర్ణయంతో ఇప్పటి వరకూ 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆర్‌బీఐ గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ద్రవ్య పరపతి సమీక్ష ఇదే కావడం గమనార్హం.
ఐదేండ్ల తర్వాత
గత రెండేండ్లుగా వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్‌బీఐ ద్రవ్యసమీక్షలు ముగుస్తు న్నాయి. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపో రేటును 6.50 శాతానికి పెంచారు. అప్పట్నుంచి ఇది అక్కడే ఉంటున్నది. ఇక రెపో రేటును ఆఖరిసారిగా తగ్గించింది 2020 మే నెలలోనే.
కరోనా దెబ్బకు దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో నూత నోత్సాహాన్ని నింపేందుకు నాటి గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రత్యేకంగా ఆర్‌బీఐ సమీక్ష నిర్వహించి రెపో రేటును తగ్గించారు.
రుణ లభ్యత పెరిగేలా 4 శాతానికి దించారు. కానీ ద్రవ్యోల్బణం విజృంభించడంతో తదుపరి ద్రవ్యసమీక్షల్లో దాన్ని అదుపు చేసేందుకు మళ్లీ వడ్డీరేట్లను వరుసగా పెంచుతూ పోయారు. ఈ క్రమంలో ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వడ్డీరేట్లను ఆర్‌బీఐ తగ్గించడం విశేషం. ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగే అవకాశం ఉంది.