calender_icon.png 27 October, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు యథాతథం

29-06-2024 12:48:19 AM

న్యూఢిల్లీ, జూన్ 28: వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అట్టిపెట్టింది. ప్రతీ త్రైమాసికానికోసారి ఈ రేట్లను సమీక్షించే ఆర్థిక శాఖ 2024 జూలై 1తో మొదలయ్యే త్రైమాసికంలో వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి స్కీమ్ కింద చేసే డిపాజిట్లకు 8.2 శాతం వడ్డీ రేటు, మూడేండ్ల టెర్మ్ డిపాజిట్‌కు 7.1 శాతం వడ్డీ రేటు యథాతథంగా కొనసాగుతుంది. ప్రాచుర్యంలో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)కు వడ్డీ రేటును 7.1 శాతం వద్ద, పోస్టాఫీసు పొదుపు డిపాజిట్లకు 4 శాతం వడ్డీ రేటును అట్టిపెట్టారు. కిసాన్ వికాస్ పత్రకు 7.5 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో చేసే పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి. 2024 జూలై త్రైమాసికంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)కు వడ్డీ రేటు 7.7 శాతంగానే కొనసాగుతుంది. ప్రస్తుత త్రైమాసికంలానే మంథ్లీ ఇన్‌కం స్కీమ్ ద్వారా మదుపుదారు లకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.