- రిజర్వ్‌బ్యాంక్ పాలసీపై నిపుణుల అంచనా
- ఈ నెల 8న వెల్లడికానున్న నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 4: వచ్చే రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టవచ్చని, రేట్ల కోతపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉన్నది. 2023 ఫిబ్రవరిలో రెపోను 6.5 శాతానికి పెంచిన తర్వాత వరుసగా ఏడు పాలసీ సమీక్షలో ఎటువంటి మార్పు చేయలేదు. వాణిజ్య బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంక్‌లు రిటైలర్లకు, కార్పొరేట్లకు ఇచ్చే రుణాలపై రేట్లను తగ్గిస్తాయి.
రెపో పెరిగితే అందుకు అనుగుణంగా బ్యాం క్‌లు సైతం రేట్లను పెంచుతాయి. గతవారం యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో మార్పు చేయనప్పటికీ, వచ్చే సెప్టెంబర్‌లో తగ్గించే సంకేతాల్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సైతం ప్రస్తుత సమీక్షలో యథాతథ పరిస్థితినే కొనసాగించవచ్చని నిపుణులు అంటున్నారు. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం ఆగస్టు 6న మొదలై 8న ముగుస్తుంది. ఆగస్టు 8 గురువారంనాడు వడ్డీ రేట్లపై ఎంపీసీ నిర్ణయం వెలువడుతుంది.
ద్రవ్యోల్బణం ఇంకా 5.1 శాతం వద్ద గరిష్ఠస్థాయిలోనే ఉన్నందున, ఆర్బీఐ యథాతథ స్థితికే మొగ్గుచూపుతుందని తాము అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. అయితే వచ్చే కొద్ది నెలల్లో బేస్ ఎఫ్‌క్ట్ ఫలితంగా ద్రవ్యోల్బణం దిగివస్తుందని భావిస్తున్నామన్నారు. ఆర్థికాభివృద్ధి స్థిరంగా ఉన్నందున, ప్రస్తుత వడ్డీ రేట్లు వ్యాపారాలకు ప్రతికూలంగా పరిణమించబోవని, అందుచేత ద్రవ్యోల్బణం దిగువబాట పట్టేవరకూ ఆర్బీ ఐ వేచిచూస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ వారం జరిగే సమీక్షలో జీడీపీ అంచనాలను కూడా ఆర్బీఐ మార్చకపోవచ్చని, భవిష్యత్ ద్రవ్యోల్బణం అంచనాల్ని మార్చే అవకాశం ఉన్నదని సబ్నవిస్ వివరించారు.
డిసెంబర్‌లో తగ్గే అవకాశం
గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన అధిక జీడీపీ వృద్ధి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 4.9 శాతం ద్రవ్యోల్బణం కారణంగా ఎంపీసీ సభ్యుల ఓటింగ్‌లో ఎటువంటి మార్పు ఉండబోదని అంచనా వేస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ చెప్పారు. 2024 జూన్‌లో జరిగిన సమీక్షలో నలుగురు ఎంపీసీ సభ్యు లు రెపో రేటు యథాతథంగా అట్టిపెట్టాలని ఓటుచేయగా, ఒక సభ్యుడు మాత్రం కోతవైపు మొగ్గుచూపారు.
ఇటీవల రుతుపవ నాలు చురుగ్గా విస్తరిస్తున్నందున ఆహార ద్రవ్యోల్బణం దిగివచ్చే అవకాశం ఉన్నదని, అంతర్జాతీయంగా, దేశీయంగా ఎటువంటి షాక్‌లు లేకపోతే 2024 అక్టోబర్‌లో ఆర్బీఐ వైఖరిని సరళంగా మార్చవచ్చని, అటుతర్వా త 2024 డిసెంబర్, 2025 ఫిబ్రవరి సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున రేట్లను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నామని నాయ ర్ వివరించారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం, తమ లక్ష్యం 4 శాతం మధ్య వ్యత్యాసం ఉన్నందున, వడ్డీ రేట్లపై తమ వైఖరి మార్చు కోవడం తొందరపాటు అవుతుందని గత నెలలో గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా సవాలుగానే వున్నందున, ఆర్బీఐ వడ్డీ రేట్లపై స్టాటస్ కో వైఖరినే అనుసరించవచ్చని సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ అభిప్రాయం వ్యక్త ం చేశారు. తదుపరి నెలల్లో కేంద్ర బ్యాంక్ సరళ వైఖరిలోకి మారుతుందని, రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందని, ఇది ఎంత త్వరితంగా జరిగితే అంత వేగంగా ఆర్థిక వ్యవస్థకు, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్‌కు మేలు జరుగుతుందన్నారు.