calender_icon.png 8 October, 2024 | 11:59 PM

వడ్డీ రేట్లు యథాతథం!?

07-10-2024 01:03:53 AM

ఆర్బీఐ పాలసీపై అంచనాలు

నేటి నుంచి ఎంపీసీ సమావేశం

9న నిర్ణయం వెల్లడి

ముంబై, అక్టోబర్ 6: ద్రవ్యోల్బణం ఆందోళన కొనసాగడం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో క్రూడాయిల్, ఇతర కమోడిటీ ధరలు ఎగిసి రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలున్నందున, ఈ అక్టోబర్ పాలసీ ద్వైపాక్షిక సమీక్షలో రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమీక్షా సమావేశం అక్టోబర్ 7 సోమవారం ప్రారంభమవుతుంది. కమిటీ నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అక్టోబర్ 9 బుధవారం వెల్లడిస్తారు. ఎంపీసీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించి ముగ్గురు కొత్త సభ్యుల్ని నియమించిన సంగతి తెలిసిందే. కేంద్రం నియమిత సభ్యులుకాకుండా ఆర్బీఐకి చెందిన మరో ముగ్గురు అధికారులు కమిటీలో ఉంటారు.

గవర్నర్‌తో పాటు ఏడుగురు సభ్యులు ఉండే కమిటీలో మెజారిటీ ఓటింగ్‌కు అనుగుణంగా పాలసీ నిర్ణయాలు వెలువడతాయి. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీ రేటు రెపో రేటును 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అదుపు చేయాలని ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించింది.

గత రెండు నెలలుగా 4 శాతంలోపునకు ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది అదుపులో ఉంటుందన్న విశ్వాసం ఏర్పడితేనే రేట్ల తగ్గింపు ఉంటుందని ఇప్పటికే శక్తికాంత్ దాస్ సంకేతాలు ఇచ్చారు. అందుచేత యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బాటను రిజర్వ్‌బ్యాంక్ అనుసరించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను అరశాతం తగ్గించిన విషయం తెలిసిందే. రేట్ల కోతల్ని ప్రారంభించేముందు, ద్రవ్యోల్బణం ట్రెండ్స్‌పై మరింత స్పష్టత కోసం ఆర్బీఐ వేచిచూస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్  మదన్ సబ్నవీస్ పేర్కొన్నారు.

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ద్రవ్యోల్బణం 5 శాతాన్ని మించే అవకాశాలు ఉన్నాయని, అందుచేత వచ్చే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించడం లేదా విధాన వైఖరిని కఠినం నుంచి సరళానికి మార్చుకోవడం ఉండదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పైగా ఇజ్రాయిల్‌ేొఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రతరమైతే, ద్రవ్యోల్బణం ట్రెండ్‌పై మరింత అనిశ్చితి నెలకొంటుందని, ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టే అవకాశాలే ఎక్కువని బీవోబీ ఎకానమిస్ట్ వివరించారు.

డిసెంబర్‌లో తగ్గే ఛాన్స్ 

  గత ఆర్బీఐ అంచనాలకంటే క్యూ1లో జీడీపీ వృద్ధి తగ్గడం, రిటైల్ ద్రవ్యోల్బణం సైతం గత అంచనాలతో పోలిస్తే దిగిరావడంవల్ల అక్టోబర్ సమీక్షలో పాలసీ వైఖరిని కఠినం నుంచి సరళానికి మార్చవచ్చని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ అంచనా వేశారు. అటుతర్వాత 2024 డిసెంబర్‌లో పావు శాతం, 2025 ఫిబ్రవరిలో పావుశాతం మేర వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నాయర్ అంచనాల్లో పేర్కొన్నారు.