calender_icon.png 21 October, 2024 | 9:09 AM

సేవింగ్స్ ఖాతాపై వడ్డీ కొంతే! ఏ బ్యాంక్‌లో ఎంత?

20-10-2024 12:00:00 AM

బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు దాచుకునే బదులు ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్‌ట) చేస్తే అధిక వడ్డీ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ ఎఫ్‌డీలో సొమ్మును ఎప్పుడుబడితే అప్పుడు తీసుకోలేరు. మీరు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి పూర్తికాకుండా ముందస్తుగా విత్‌డ్రా చేస్తే పెనాల్టీలు చెల్లించుకోవడంతో పాటు నిర్దేశిత వడ్డీ రేటు ప్రకారం చేతికి డబ్బు రాదు.

అదే సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బును ఎప్పుడైనా తీసుకోవచ్చు. పొదుపు ఖాతాకు వడ్డీ వస్తుంది గానీ, అది చాలా తక్కువ. సేవింగ్స్ ఖాతా ఉన్నవారిలో అధికశాతంమందికి వారి ఖాతాలో ఉన్న సొమ్ముకు ఎంత శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తున్నదీ, దేని ప్రకారం వడ్డీని లెక్కకడుతున్నదీ అవగాహన ఉండదు. ఇటువంటి అవగాహన కొసమే ఈ కథనం.

డైలీ బ్యాలెన్స్‌పై వడ్డీ చెల్లింపు

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ అ కౌంట్లకు నిర్ణీత కాలపరిమితి ఉండదు. సాధారణంగా సేవింగ్స్ ఖాతాకు ఒక వడ్డీ రే టును బ్యాంక్ నిర్ణయిస్తుంది. రోజువారీ బ్యాలెన్స్‌పై (ఒక రోజులో మీ డిపాజిట్ల నుంచి విత్‌డ్రాయిల్స్ మినహాయించిన తర్వాత) వడ్డీని బ్యాంక్ లెక్కిస్తుంది. దాని ప్రకారం మూడు నెలలకోసారి వడ్డీని మీ ఖాతాల్లో జమచేస్తుంది. 

వడ్డీ రేట్లలో మార్పులు

ఫిక్స్‌డ్‌కైనా, సేవింగ్స్‌కు అయినా రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య విధానం, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా బ్యాంక్‌లు వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. ఎఫ్‌డీలకైతే వివిధ బ్యాంకుల మధ్య రేట్ల వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. కానీ సేవింగ్స్ ఖాతాపై ఇచ్చే వడ్డీలో వ్యత్యాసం అధికంగా ఉంటుంది.

వడ్డీ రేట్ల నిర్ణయంపై ఆయా బ్యాంక్ ఆర్థిక పనితీరు, వ్యాపార వ్యూహం కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకు అనుగుణంగా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు మారుతుంటాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం మేర తగ్గించింది. వివిధ ప్రధాన బ్యాంక్‌ల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు ఇవే. 

కోటక్ బ్యాంక్

రూ.5 లక్షల లోపు సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. రూ.5 లక్షలకుపైబడి రూ.50 లక్షల లోపు ఉన్న ఖాతాలపై 3.5 శాతం, రూ.50 లక్షలకుపైబడిన ఖాతాలపై 4 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. 2024 అక్టోబర్ 17 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

రూ.50 లక్షల లోపు సేవింగ్స్ ఖాతాలపై 3 శాతం, ఆ మొత్తానికి మించిన ఖాతాలకు 3.50 శాతం వడ్డీని ఇస్తున్నది. ఈ రేట్లు 2022 ఏప్రిల్ నుంచి అమల్లో ఉన్నాయి. 

ఐసీఐసీఐ బ్యాంక్

రూ.50 లక్షల లోపు సేవింగ్స్ ఖాతాలపై 3 శాతం, ఆ మొత్తానికి మించిన ఖాతాలకు 3.50 శాతం వడ్డీని ఇస్తున్నది. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్

రూ.10 లక్షల లోపు నిల్వగల సేవింగ్స్ ఖాతాపై 2.7 శాతం, రూ.10 లక్షలకు మించిన సేవింగ్స్ ఖాతాపై 2.75 శాతం వడ్డీ ఇస్తున్నది. ఈ రేట్లు 2023 జనవరి నుంచి అమలవుతున్నాయి. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

రూ.50 లక్షల వరకూ నిల్వగల సేవింగ్స్ ఖాతాపై 2.75 శాతం, రూ.50 లక్షలకు మించిన సేవింగ్స్ ఖాతాపై 2.90 శాతం వడ్డీ ఇస్తున్నది. రూ.100 కోట్లు దాటిన డిపాజిట్‌పై ఇచ్చే వడ్డీ రేట్లు 3.10 శాతం-4.20 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఈ రేట్లు 2024 జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి.