calender_icon.png 11 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో పెరిగిన వడ్డీ.. 420 శాతం

02-11-2024 12:11:17 AM

  1. 2024-25 రెండో త్రైమాసికంలో భారీగా పెరిగిన కిస్తీలు
  2. 2016 క్యూ-2లో కట్టిన మిత్తీలు రూ.3,098.75 కోట్లు
  3. 2024లో వడ్డీల కింద ఏకంగా రూ.13,187.41 కోట్లు  
  4. స్వరాష్ట్రంలో తొలిసారి బడ్జెట్ అంచనాల్లో 75 % వడ్డీలు చెల్లింపు 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వం కట్టే వడ్డీ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది క్యూ2లో ప్రభుత్వం ఏకంగా రూ.13,187.41 కోట్ల మిత్తీ కట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తం వడ్డీల కింద కట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2015 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,098.75 కోట్లను వడ్డీల కింద చెల్లించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మాత్రం రూ.13,187.41 కోట్లను చెల్లించింది. గత పదేళ్లలో ప్రభుత్వం కట్టే మిత్తీలు 420 శాతం పెరగడం ఆందోళనకరంగా మారింది. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు ఇష్టంవచ్చినట్టు అప్పులు చేసింది.

బహిరంగ మార్కెట్లో 7 శాతానికి రుణాలు ఇస్తున్నా.. గత సర్కారు పది శాతానికిపైగా వడ్డీకి అప్పు చేసింది. ఆ ప్రభుత్వం పదేళ్లు తీసుకున్న రుణాలు.. ౧౦ నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పులు ఖజనాకు గుదిబండలా మారాయి. దీంతో అప్పుల కుప్ప పెరిగిపోవడంతో దానికి అనుగుణంగా వడ్డీలు అదే స్థాయిలో పెరగడం గమనార్హం.

తెలంగాణ వచ్చాక తొలిసారి 75 శాతం

క్యూ2లో ప్రభుత్వం రూ.13,187.41 కోట్లను వడ్డీల రూపంలో కట్టింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 75 శాతం. తెలంగాణ వచ్చిన తర్వాత క్యూ2లో ఎప్పుడు కూడా బడ్జెట్ అంచనాల్లో 54 శాతం దాటలేదు. కానీ, ఈ ఏడాది ఏకంగా ఏకంగా 75 శాతం మిత్తీలను ప్రభుత్వం కట్టింది. మరో రెండు త్రైమాసికాలు ఉండి కూడా.. ఇప్పటికే బడ్జెట్ అంచనాల్లో 75 శాతం వడ్డీని ప్రభుత్వం కట్టింది.

గత మూడేళ్లుగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే అధికంగా వడ్డీలను చెల్లిస్తోంది. 2021-22లో 105 శాతం, 2022-23లో 110 శాతం, 2023-24లో 104 శాతం వడ్డీలను ప్రభుత్వం కట్టింది. ఈ ఏడాది ముగిసే నాటికి అది 150 శాతానికి చేరినా ఆశ్చర్యపోనవడసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రీషెడ్యూల్ చేసేనా?

గత ప్రభుత్వం పదేళ్లలో రూ.6.85 లక్షల కోట్ల అప్పులు చేసి, ఆ భారాన్ని తమపై మోపిందని సీఎం రేవంత్‌రెడ్డి తరచూ ఆరోపిస్తున్నారు. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని చూస్తోంది. దీనివల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది.

ఈ అంశంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థించినా స్పందన రాలేదు. రీషెడ్యూల్ అంశాన్ని సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసిన ప్రతీసారి కోరుతున్నారు. మరి రుణాల రీషెడ్యూల్‌కు కేంద్రం ఓకే చెబుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఏడాది చెల్లించిన బడ్జెట్ అంచనాల్లో 

వడ్డీ(కోట్లలో) కట్టిన వడ్డీ శాతం

2015-16 3,098.75 41.02

2016-17 3,539.96 45.94

2017-18 4,718.52 42.36

2018-19 5,594.18 47.85

2019-20 4,663.74 32.00

2020-21 7,660.01 52.41

2021-22 8,801.55 50.05

2022-23 10,100.47 53.41

2023-24 11,265.13 50.27

2024-------25 13,187.41 74.38