17-03-2025 12:00:00 AM
మార్కెట్లో 10 నుంచి 30 లీటర్ల కుండలు
’నల్లా’ మట్టి కుండకు డిమాండ్..
వైరా, మార్చి 16 ( విజయ క్రాంతి): ఎండలు మండుతున్నాయి.. వేసవి తాపం రోజు రోజుకు విజ్రుంభిస్తోంది. దీంతో శరీరం చల్లటి నీటిని కోరుకుంటుంది.. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వేసవి తాపం తీర్చుకోవడం కోసం వారి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ’పేదోడి ఫ్రిజ్’ గా పిలువబడే మట్టి కుండ వైపు అడుగులు వేస్తున్నారు.. మట్టి కుండ కొనుగోలు చేయడం ద్వారా చల్లని నీరు దాహార్తి తీర్చుకోవడంతోపాటు.. చక్కని ఆరోగ్యాన్ని కూడా వారు కైవసం చేసుకుంటున్నారు.. ఇదిలా ఉంటే ఆరోగ్య రహస్యం తెలిసిన మధ్యతరగతి, సంపన్న వర్గాల, ప్రజలు సైతం స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం అల్యూమినియం, నాన్ స్టిక్ ఇంకా, స్టీల్ పాత్రలను పక్కనపెట్టి మట్టి కుండలు, మట్టి పాత్రలు వినియోగంపై మక్కువ చూపుతూ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు..
మట్టి వస్తువుల తయారుచేసే కార్మికుల కొరత తోపాటు, ఆ వస్తువుల వినియోగం పెరగటంతో మట్టి కుండలకు వంట పాత్రలకు మంచి గిరాకీ పెరిగింది .. దీంతో వైరా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన కుండలు అమ్మే దుకాణం వద్ద తాకిడి పెరిగింది.. దూర మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు.. పలు సైజుల్లో కుండలను అమ్మకాలు జరుపుతున్నారు.. 30 లీటర్ల కుండ 550 రూపాయలు కాగా 20 లీటర్లు 350, 15 లీటర్లు 250, చిన్న సైజు కుండా 150 రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు.. ఏదేమైనాప్పటికీ ఈ వేసవిలో ముందుగానే చల్లని తాపం మొదలైందనే విషయం మండుతున్న ఎండలు చూస్తే అర్థమవుతున్నాయి..
మట్టి కుండలు, వంట పాత్రలకు గిరాకీ
గత ఐదేళ్లుగా మట్టి కుండల వస్తువుల, వ్యాపారం చేస్తున్నామని బండారి భూదేవి, శ్రీను దంపతులు తెలిపారు. వంట పాత్రల తోపాటు పలు రకాల బొమ్మలు, మంచి నీటి బాటిల్లు, జగ్గులు, గల్లా గురుగులు, దేవుళ్ళ బొమ్మలతో పాటు ఆట బొమ్మలను కూడా మట్టితో తయారుచేసి అమ్ముతు న్నామని తెలిపారు.. చక్కని ఆరోగ్యం కోసం చాలామంది మట్టి తో తయారుచేసిన వంట పాత్రలను ఎక్కువ శాతం మంది కొనుగోలు చేస్తున్నారని, ప్రస్తుతం మట్టికుండకు చాలా గిరాకీ ఉందని వారు తెలిపారు.. గతంలో కుండలు కారుతున్నాయని, నాసిరకంగా ఉన్నాయని గుర్తించి సుదూర ప్రాంతాల నుంచి అధిక ధర వెచ్చించి మరీ నాణ్యత గల మట్టి వస్తువులను కుండలను తెప్పిం చామని ఈ సందర్భంగా వారు తెలిపారు.. నల్లా గల మట్టికుండ కొనుగోలుపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నట్లు ఈ సందర్భంగా విజయ క్రాంతికి తెలిపారు .
మట్టి వస్తువుల వ్యాపారి బండారి భూదేవి, శ్రీను.