27-04-2025 10:00:16 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి...
క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం..
బీరంగూడలో ఘనంగా ముగిసిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్రస్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు..
విజేతలకు రూ.2 లక్షల సొంత నగదుతో బహుమతులు అందజేత..
పటాన్ చెరు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచ్ ప్రెస్, పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం విజేతలకు రెండు లక్షల రూపాయల సొంత నగదుతో నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్ చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. నేటితరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యం నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని చెప్పారు. పటాన్ చెరులో రూ.7.50 కోట్లతో మైత్రి స్టేడియం ఆధునికరించినట్లు గుర్తు చేశారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను.. క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అరవ రామకృష్ణ, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రేణుక, రిష్వంత్ రెడ్డి, షకీల్, క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.