ఐటిడిఏ పిఓ రాహుల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. క్రీడలు మేధాశక్తిని పెంపొందించడంతో పాటు శరీరాక, మానసిక ఉల్లాసం పెంపొందించి మంచి ఆరోగ్యంగా ఉండేలా దోహదపడతాయన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని గౌరారం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. గిరిజన బాలికలు క్రీడా స్థలాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికారమైన ఆహారము అందుతున్నది లేనిది విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు చదువుతో పాటు వారికి ఇష్టమైన క్రీడలలో పాల్గొని నైపుణ్యం సాధించడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతిరోజు చదువుతో పాటు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా మీకు ఇష్టమైన క్రీడలలో పాల్గొనాలని, శక్తి మేర క్రీడలలో పాల్గొని మీరు అనుకున్న లక్ష్యం సాధించాలనారు.
గత నెలలో ఉట్నూరులో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడలలో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా గర్వకారణం అని, ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. స్పోర్ట్స్ కు సంబంధించిన క్రీడా మెటీరియల్ అన్ని పాఠశాలలకు అందిస్తానని గతంలో హెచ్ఎం లకు తెలియజేయడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం 80 పాఠశాలలకు ఇప్పటికే క్రీడా మెటీరియల్ అందించడం జరిగిందన్నారు. మిగతా పాఠశాలలకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థినిలు చదువుతో పాటు తప్పనిసరిగా క్రీడలలో పాల్గొనాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి క్రీడలలో పాల్గొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ నాగేశ్వరరావు, హెచ్ఎం మోతిర్, వార్డెన్ లక్ష్మీపతి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.