22-02-2025 12:05:21 AM
ఖమ్మం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని డేగల యోగ నందిని శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ఏటపాక మండల కేంద్రానికి చెందిన సత్యంరాజు, మంజుల కుమార్తె అయిన యోగనందిని ఖమ్మంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతుంది.
ఇటీవల ఇంటికి వెళ్లి గత బుధవారం తిరిగి వచ్చింది. శుక్రవారం ఉదయం స్టడీ అవర్‌కు వెళ్లి, మధ్యలో వాష్‌రూంకి వెళ్లొస్తానని చెప్పి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. విద్యార్థిని మృతిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
అనారోగ్యంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల యాజమాన్యం వాదిస్తుండగా, కళాశాల యాజమాన్యం వేధింపులు వల్లనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కళాశాల ఎదుట పెద్దఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. స్థానిక ఖానాపురం హెవేలీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.