- ఘటన స్థలంలో ప్రేమ లేఖ లభ్యం?
- కళాశాల ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్ సస్పెన్షన్
ఖమ్మం, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయివర్ధన్ అనుమానాస్పదస్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన సాయివర్ధన్ కృష్ణాపురం కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారమే ఇంటి నుంచి వచ్చిన సాయివర్ధన్.. మంగళవారం తెల్లవారే సరికి కళాశాల గదిలో ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. మధిర రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులకు ఘటనా స్థలంలో ప్రేమ లేఖ దొరికినట్టు తెలిసింది. విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో నర్సింహారావు కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను, హౌస్ మాస్టర్ మోషేను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు.
కాగా సాయివర్ధన్ ఆత్మహత్యకు కాలేజీ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఎక్స్‌గ్రేషియో ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.