calender_icon.png 5 March, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ ది బెస్ట్... నేటినుంచి ఇంటర్ పరీక్షలు

05-03-2025 12:00:00 AM

  1. నేడు హాజరుకానున్న ఫస్టియర్ విద్యార్థులు 4,88,448 మంది
  2. రేపటినుంచి సెకండియర్ పరీక్షలు.. హాజరుకానున్న విద్యార్థులు 5,08,523మంది 
  3. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి
  4. పేపర్ లీక్‌లకు తావులేకుండా ప్రతీ ప్రశ్నపత్రానికి క్యూఆర్ కోడ్, యూనిక్ నంబర్

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షను ఫస్టియర్ విద్యార్థులు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,88,448 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

మొత్తం 1,532 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి జరిగే ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 5,08,523 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈసారి ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. అయితే పరీక్షలకు విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్య మొచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.

కానీ విద్యార్థులు 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పేపర్ లీకులు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

ఈసారి తొలి సారిగా హాల్‌టికెట్లపై సెంటర్ లోకేటర్ క్యూఆర్‌కోడ్‌ను ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్‌చేస్తే సెంటర్ అడ్రస్, ఎంత దూరముంటుంది, ఎన్ని నిమిషాల్లో సెంటర్‌కు చేరుకోవచ్చో తెలుపుతుంది. పేపర్ లీకేజీల నుంచి బయటపడేందుకు ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్, ప్రతీ ప్రశ్నపత్రానికి యూనిక్ నెంబర్‌ను ముద్రించారు.

పరీక్షల నిర్వహణకు 72 ఫ్లయింగ్ స్క్వాడ్, 124 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయగా, 1,532 చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, 29,992 మంది మంది ఇన్విజిలెటర్లను నియమించారు. 

బెస్ట్ విషెస్ చెప్పిన కేటీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెస్ట్ విషెస్ చెప్పారు. ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా ఉంటూ మీ వంతు కృషి చేస్తూ పరీక్షలు రాయాలని సూచిస్తూ  ‘ఎక్స్’లో  కేటీఆర్ ట్వీట్ చేశారు.