calender_icon.png 15 January, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

14-08-2024 02:41:58 AM

రూ.23 లక్షల నగదు, 31 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం

నల్లగొండ, ఆగస్టు 13 (విజయక్రాంతి): తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండ లం అనిశెట్టిదుప్పలపల్లి మండలం క్రాస్‌రోడ్డు వద్ద ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. స్కూటర్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఇద్దరిని నిలిపి తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు, ఇసుప రాడ్డు కనిపించాయి.

అనుమానం వచ్చి వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మరికొందరితో కలిసి జిల్లాతోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. నిందితులిచ్చిన సమాచారంతో చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నలుగురిని, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో మరొకరిని అదుపులోకి తీసుకు న్నారు. నిందితుల్లో గుండెబోయిన మహేశ్, మల్లేష్ మినహా నూతి సతీష్,  బొడిగే అశోక్,  బైరబోయిన స్వామి, గుండెబోయిన చంద్రం,  బడే బాలకృష్ణ పాత నేరస్తులు.

బొడిగె అశోక్ మినహా మిగిలిన వారంతా పెద్దకాపర్తి గ్రామానికి చెందిన వారేనని ఎస్పీ వెల్లడించారు. ముఠాకు చెందిన మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 23 లక్షలకుపైగా నగదు, 31 తులాల బంగారం, కిలో వెండి, స్కూటర్‌తోపాటు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.